డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. మ‌రో వారంలో స‌భా కార్య‌క్ర‌మాలు ముగియ‌నున్నాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్య‌వ‌హారంపై జ‌రిగిన క‌స‌ర‌త్తు ఒక కొలిక్కి రాక‌పోవ‌డం.. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాలు స‌హ‌క‌రించేందుకు రెడీగా లేక‌పోవ‌డంతో డీలిమిటేష‌న్‌పై ప్ర‌భుత్వం దాదాపు వెన‌క్కి త‌గ్గిన‌ట్టే క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి త్వ‌ర‌లోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ బిల్లును ఎలాగైనా ఆమోదించుకునేందుకు కేంద్రం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఈ బిల్లును పార్లమెంట్‌లో పాస్ చేయించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలిసి చర్చలు జరిపారు. గ‌తంలో కూడా ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌తిప‌క్ష నేత కార్యాల‌యానికి వెళ్లి మ‌రీ చ‌ర్చించారు. అయినా ఎలాంటి ఫలితం రాలేదు. మరోవైపు దీనికోసం ప్రత్యేక సమావేశం పెడతారనే మాట వినిపించింది కానీ దానిపై ప్రభుత్వ పెద్దలు ఇప్పటివరకు స్పందించలేదు.

మరోవైపు ప్రస్తుత సమావేశంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లును పాస్ చేయిస్తారన్న ప్రచారం జ‌రుగుతున్నా.. దీనిని ప్రభుత్వం తోసిపుచ్చింది. అంటే.. ఈ బిల్లు వ్య‌వ‌హారం.. ఇప్పుడు జ‌రుగుతున్న స‌భ‌ల్లోనే తేలాలి. కానీ, తేల‌ద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వ‌చ్చే ఏడాది నాటికి దీనిని వాయిదా వేసిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రోవైపు.. ఇటు లోక్‌స‌భ‌లోను.. అటు రాజ్య‌స‌భ‌లోనూ.. త‌మ బ‌లాన్ని మ‌రింత పెంచుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఎందుకు?

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అనేది రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు. దీనిని ఆమోదించాంటే.. అటు లోక్‌స‌భ‌లోను, ఇటు రాజ్య‌స‌భ‌లోనూ 2/3వ వంతుమంది స‌భ్యుల మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌తిప‌క్షాలు స‌హ‌క‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ, ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలు.. కేంద్రం నుంచి క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాయి. అదేస‌మ‌యంలో అమిత్ షా రాజీనామాకు కూడా ప‌ట్టుబ‌డుతున్నారు. దీంతో పార్ల‌మెంటులో రోజూ గంద‌ర‌గోళం జ‌రుగుతూనే ఉంది.