మీరు నేర్పిన విద్యే… కేటీఆర్ స‌ర్‌!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌.. తాజాగా మీడియాపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. ముఖ్యంగా ఆయ‌న ప్ర‌ధాన మీడియాపై చెణుకులు విసిరారు. రాష్ట్రంలో ప్ర‌ధాన మీడియా `దాసోహం` చేస్తోంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కీల‌క వార్త‌ల‌నుతొక్కి పెడుతున్నార‌ని అన్నారు. “ఎవ‌రి మెప్పుకోసం ఇదంతా చేస్తున్నారో.. మీడియా సంస్థ‌లు ఆలోచ‌న చేసుకోవాలి. ప్ర‌జ‌ల‌కోసం ఉన్నారా?  వ్య‌క్తుల కోసం  ఉన్నారా?“ అంటూ.. త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. అంతేకా దు.. ప్ర‌జ‌ల‌తో చేసే వ్యాపారం కోసం.. కొంద‌రు వ్య‌క్తుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం కూడా స‌రికాద‌న్నారు.

ఇదేస‌మ‌యంలో రాష్ట్రంలో ఓ కీల‌క నేత కుమారుడు పోక్సో కేసులో చిక్కుకున్న వ్య‌వ‌హారాన్ని కూడాఆయ‌న ప్ర‌స్తావించారు. బాధితురాలి ఆవేద‌న ప్ర‌ధాన మీడియాకు వినిపించ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. నాలుగు రోజుల వ‌ర‌కు కూడా ప్ర‌ధాన మీడియా ఈవిష‌యంపై ప‌న్నెత్తు మాట కూడా మాట్లాడ‌లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కేవ‌లం సోష‌ల్ మీడియా అండగా ఉండ‌డం వ‌ల్లే.. బాధితురాలి ఆక్రంద‌న రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. దీంతో స‌ద‌రు నేత కుమారుడిని అరెస్టు చేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించా రు. ప్ర‌ధాన మీడియా ఇంత‌గా నేత‌ల‌కు `ఊడిగం` చేయాలా? అని ప్ర‌శ్నించారు. ఇక‌నైనా ప్ర‌జల కోణంలో ఆలోచ‌న చేయాల‌ని కేటీఆర్ సూచించారు.

క‌ట్ చేస్తే..

కేటీఆర్ ఇప్ప‌టి ఆవేద‌న‌లో త‌ప్పులేక‌పోవ‌చ్చు. పైగా.. త‌న‌కు సంబంధించిన నిర‌స‌న‌లు, ధ‌ర్నాల కార్య‌క్ర‌మాలు కూడా ప్ర‌ధాన మీడియాలో క‌వ‌ర్ కావ‌డం లేద‌న్న ఆవేద‌న‌, ఆందోళ‌న కూడా ఉండి ఉంటుంది. కానీ, ఇదే బీఆర్ ఎస్ పార్టీ ప‌దేళ్లపాటు అధికా రంలో ఉన్న‌ప్పుడు.. ఏం చేసింద‌న్న‌ది త‌వ్వి తీయాల్సిన అవ‌స‌రం లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంద‌ని అంటున్నారు. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా పాల‌న‌ను ప్ర‌శ్నించిన ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌ను, మీడియాను మూసివేయించే ప్ర‌య‌త్నం చేయ‌లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాను మెచ్చుకుంటున్న కేటీఆర్‌.. అధికారంలో ఉన్న‌ప్పుడు.. “ప‌నిలేని పిచ్చోళ్లు చానెళ్లు పెట్టుకుంటరు“ అని వ్యాఖ్యానించిన తీరును ప్ర‌శ్నిస్తున్నారు.

నాడు న‌ల్ల‌గొండ భూముల విష‌యంలో ప్ర‌శ్నించిన ఎస్సీయువ‌కుల‌ను నిర్బంధించిన‌ప్పుడు.. వార్త‌లు బ‌య‌ట‌కు రాకుండా అడ్డుకున్న‌ది ఎవ‌రో అంద‌రికీ తెలుసున‌ని విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. ప్ర‌జాస్వామ్యం గురించి.. మీడియా స్వేచ్ఛ గురించి ఇప్పుడు ధ‌ర్మ‌ప‌న్నాలు వ‌ల్లిస్తున్న కేటీఆర్‌.. ఈఫార్ములా రేస్ గురించి రాసిన ప‌త్రిక‌ను దుయ్య‌బ‌ట్టిన సంగ‌తి ఏంట‌ని?  ప్ర‌శ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఇదే ధోర‌ణితో మీడియా స్వేచ్ఛ‌కు భంగం క‌లిగించ‌కుండా ఉండి ఉంటే.. ఇప్పుడు ప్ర‌శ్నించేందుకు, అడిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఇక‌, బీఆర్ ఎస్ హ‌యాంలో 22 యూట్యూబ్ చానెళ్ల‌ను బంద్ చేయించార‌ని, ఒక ప్ర‌ధాన ప‌త్రిక‌ను మూయించే ప్ర‌య‌త్నం చేస్తే.. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన వ్య‌వహారాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.