టీడీపీ మహిళా నేత, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియపై పలు ఆరోపణలు రావడం.. ఆమెపై సొంత పార్టీ నాయకులే తీవ్రస్థాయిలో విజృంభించడం.. ఫిర్యాదులు రావడంతో పార్టీ అధిష్టానం చక్కదిద్దే కార్యక్రమానికి తెరదీసింది. ఈ క్రమంలో అఖిల ప్రియ నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ చీఫ్ పల్లాశ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆమెను పల్లా శ్రీనివాసరావు సుదీర్ఘంగా 3 గంటలకుపైగా విచారించారు.
ఈ సందర్భంగా ఆమెపై స్థానిక టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించారు. “ఎమ్మెల్యే ఎవరు..? మీరా? మీ ఆయనా?“ అని పల్లా ప్రశ్నించడంతో ఆమె అవాక్కయ్యారు. అదేవిధంగా అహోబిలం పుణ్యక్షేత్రంలో మీకు పనేంటి? అక్కడ ఎందుకు రాజకీయం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. దీనికి ఆమె మౌనంగా ఉండిపోయారు. అలానే స్థానికంగా బార్లు నిర్వహిస్తున్న వారి నుంచి కూడా వచ్చిన ఫిర్యాదులపై పల్లా శ్రీనివాసరావు నిలదీశారు. అయితే.. కొన్నింటికి తనకు తెలియదని.. మరికొన్నింటికి.. తనపై ఉన్న రాజకీయ దురుద్దేశంతోనే కొందరు ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే.. ఈ సమయంలో అఖిల ప్రియ భర్త చేసిన పనులు, దీనికి సంబంధించిన ఆధారాలను కూడా పల్లా బయట పెట్టారు. వీటికి ఏమంటారని ప్రశ్నించారు. అయితే.. తాను పార్టీ లైన్‌ను ఎప్పుడూ దాటలేదని.. పార్టీకి అనుకూలంగానే పనిచేస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో కొందరు పనిగట్టుకుని తనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే.. ఈ సమయంలో పల్లా జోక్యం చేసుకుని.. వారి పేర్లు ఇస్తే.. వారు ఎందుకు అలా చేస్తున్నారో కూడా తెలుసుకుంటామని చెప్పారు. మొత్తంగా 3 గంటల విచారణలో తను పార్టీలైన్‌కు భిన్నంగా వ్యవహరించని.. ఈదఫా తప్పులు జరగకుండా చూసుకుంటానని ఆమె వివరించారు.
ఇవీ.. ప్రధాన ఆరోపణలు
+ స్థానికంగా ఉన్న బార్లు, లిక్కరు షాపుల నుంచి కమీషన్లు ఆశిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
+ అహోబిలం పుణ్యక్షేత్రం మఠం పరిధిలో ఉంది. కానీ, ఇక్కడ తను చెప్పిన వారికే షాపులు కేటాయించాలని ఎమ్మెల్యే వర్గం పట్టుబడుతోంది.
+ ఇటీవల తలనీలాలు సమర్పించే కాంట్రాక్టును తన వారికే ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆమె ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు.
+ స్థానిక టీడీపీ నేతలతో వివాదాలు ఉన్నాయి. తను చెప్పిందే వేదం అన్నట్టుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని స్థానిక నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
+ అఖిల ప్రియ భర్త షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా వీటికి సంబంధించిన ఆధారాలతో సహా ఫిర్యాదులను పార్టీ పరిగణనలోకి తీసుకుని విచారణకు పిలిచింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
