ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది. ఆయా నేతలు.. ఆయా పార్టీల గ్రాఫ్‌ను బట్టి.. ఈ సింపతీ ప్రభావం ఉంటుంది. ఐదేళ్లు పాలన చేసిన వైసీపీ పై ప్రజల్లో కూడా.. అంతో ఇంతో సింపతీ అయితే ఉంది. కానీ.. దీనిని పార్టీ అధినేత జగన్, ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా నానాటికీ దిగజార్చుకుంటున్నారు. ఫలితంగా.. వైసీపీపై ఏవగింపు పెరుగుతోంది.
ఇది వైసీపీ పతనానికి దారి తీస్తోంది. ఇక, ఇదే అదునుగా ప్రత్యర్థి పార్టీలు కూడా వైసీపీని మరింత డైల్యూట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిని రాజకీయ కోణంలో చూసినప్పుడు.. తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎవరి ఎత్తుగడలు వారివి. అయితే, ప్రత్యర్థి పార్టీలు వైసీపీని ఇరకాటంలోకి నెడుతున్న క్రమంలో ప్రజల నుంచి సింపతీ వస్తోందా? రావట్లేదా? అనేది ముఖ్యం. ఈ కోణంలో చూసినప్పుడు.. వైసీపీపై ప్రజల్లో విముఖత ఏర్పడిన ప్రతిసారీ.. ప్రభుత్వ పక్షం కొరడా ఝళిపిస్తోంది. దీంతో వైసీపీకి కోలుకోలేని విధంగా దెబ్బతగులుతోంది.
గతంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అయినా.. ఇప్పుడు డీఎస్సీపై నిరసన అయినా.. వైసీపీ పట్ల ప్రజల్లో విముఖత పెరుగుతున్న సమయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో సింపతీ ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి గతంలో టీడీపీ నేతలపైనా.. పార్టీ అధినేత చంద్రబాబుపైనా.. కేసులు నమోదు చేసినప్పుడు.. సింపతీ ఏర్పడింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నాటి చర్యలను ఖండించారు. తద్వారా పెద్ద ఉద్యమమే ఏర్పడింది.
కానీ, ఇప్పుడు వైసీపీ విషయంలో ఆ తరహా పరిస్థితి లేకుండా పోయింది. ఏకంగా 51 మందిపై రౌడీషీట్లు తెరవడం రాష్ట్రంలోనే ఫస్ట్ టైమ్ అయినప్పటికీ.. వైసీపీ పై ఎవరికీ జాలి కలగకపోవడం గమనార్హం. కనీసం వైసీపీకి మద్దతుగా ఎవరూ నోరు విప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులపై జరిగిన దాడులను సభ్య సమాజం ఎంత సీరియస్‌గా తీసుకుందన్నదానికి ఈ చర్యలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇక, పాదయాత్ర ప్రారంభించే నాటికి వైసీపీ నేతలపై మరిన్ని కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రజల నాడికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కారణంగానే.. ఇలా జరుగుతోందన్నది విశ్లేషకులు చెబుతున్నమాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates