కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన ఆయన ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా రాహుల్ గాంధీ వైపు అడుగులు వేస్తున్నారా…? ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమేననిపిస్తున్నాయి. ఇతర పార్టీల నాయకులతో కలిసేందుకు ఏమాత్రం ఇష్టపడని జగన్ ఈమధ్య సిపిఐ నాయకులతో కలిసి మాట్లాడ్డం, ప్రజా సమస్యలపై కలిసి పోరాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. సీఈసీ వివాదంలో విపక్షాల డిమాండ్ కు అనుకూలంగా ఎక్స్ లో మెసేజ్ పోస్టు చేయడంపై ఇపుడు దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

సీఈసీ వ్యవహారంలో జగన్ ట్విట్ మీద తీవ్రమైన విమర్శలు కూడా వస్తున్నాయి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చాలా వేగంగా స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల సంఘం నియామక చట్టానికి వైసీపీ ఎంపీలు మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె ఇప్పుడు జగన్ దానికి భిన్నంగా మెసేజ్ పెట్టడం గురించి అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా అదే సందేహం వెలిబుచ్చారు. కృష్ణదేవరాయలు ఎమన్నారంటే….

సర్‌ ప్రక్రియ రాజకీయంగా దుర్వినియోగమవుతోందంటూ బహిరంగ విమర్శలు గుప్పిస్తున్న జగన్ మరోవైపు సర్‌ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ద్వారా హైకోర్టును ఎందుకు కేసు వేయించారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. న్యాయస్థానంలో ఒకలా, ప్రజల ముందు మరోలా వ్యవహరిస్తూ నాటకాలాడుతున్నారని తప్పు పట్టారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచనతోనే జగన్ ఈసీకి వ్యతిరేకంగా ట్విట్ చేశారని విమర్శలు గుప్పించారు.

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ పేరుతో జెన్ జీ చేసిన ఆందోళన విజయవంతం అయినప్పటి నుంచి జగన్ ఆలోచనల్లో మార్పు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ తర్వాత పరిణామాలు, ఈసీ వ్యవహారంలో ఎన్డీఏ ఇబ్బందుల్లో పడడంతో జగన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికారంలో వున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇదే కూటమి ఎన్నికలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోతే నష్టం జరుగుతుందని నమ్ముతున్న ఆయన ఇక బీజేపీని నిమ్ముకోవడం వృధా ప్రయాస అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో జగన్ ఇండియా కూటమికి స్నేహస్తం చాచుతున్నట్లు వినిపిస్తుంది.