శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత నమ్మకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దసరాతో తనకు తొలి అవకాశం ఇవ్వడమే కాక.. అతను కోరినట్లుగా పూర్తి మేకోవర్ అయి, నిర్మాతతో భారీ బడ్జెట్ పెట్టి సినిమా చేశాడు. ఆ సినిమాతో పెద్ద హిట్టు కొట్టాక అంతకుమించిన భారీతనం, మేకోవర్‌తో ది ప్యారడైజ్ మూవీ చేశాడు.
ఈ సినిమా మేకింగ్ బాగా ఆలస్యం అయినా.. శ్రీకాంత్ కోసం నిలబడ్డాడు. ఇప్పుడు మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. నాని తన దర్శకుడికి అదే సపోర్ట్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ది ప్యారడైజ్ సక్సెస్ ప్రెస్ మీట్లో నాని గురించి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాని తనను తిట్టినట్లు ఈ సినిమా మేకింగ్ టైంలో వచ్చిన వార్తలు నిజమే కావచ్చు అంటూ.. ఏం జరిగినా నాని తనను భరించాల్సిందే అని.. చచ్చే వరకు తమ బంధం కొనసాగుతందని అతను వ్యాఖ్యానించాడు.
”నన్నునాని అన్న తిట్టాడని, కొట్టాడని, తన్నాడని రకరకాల వార్తలు విన్నాను. అది నిజమే కావచ్చు. నాని అన్న నన్ను తిట్టి ఉండొచ్చు. కొట్టి ఉండొచ్చు. నేను, అన్న గొడవలు పడ్డామన్నది నిజమే కావచ్చు. ఐతే మాది ఈ దసరా సినిమాతోనో, ప్యారడైజ్ సినిమాతోనో అయిపోయే బంధం కాదు. నేను నాని అన్న కొట్టుకుంటాం. తిట్టుకుంటాం. ముద్దు పెట్టుకుంటాం, మూతులు నాక్కుంటాం. మీకెందుకు?
కొన్ని ఎమోషన్స్ పుట్టుకతో కాదు, సచ్చిపోయేవరకు మోయాలి. ఆయన నన్ను భరించాలి అంతే. ఆప్షన్ లేదు. మొయ్యాలి ఆప్షన్ లేదు. అసలు దానిలో సమస్యే లేదు. నువ్వు తీసుకొచ్చి పెట్టినావు కాబట్టి అది నీదే బాధ్యత, నువ్వే మొయ్యాలి. మోస్తావు కూడా” అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
ఇక మోహన్ బాబు గురించి మాట్లాడుతూ.. ప్యారడైజ్ సినిమాకు గాను తనకు ఏ అవార్డు వస్తుందో తెలియదని, కానీ మోహన్ బాబుతో పని చేయడం అన్నది ఒక ఇంటర్నేషనల్ అవార్డుతో సమానమని శ్రీకాంత్ అన్నాడు. మోహన్ బాబు సార్ ఒక హిట్లర్, ఆయన చెప్పిన మాట వినరు, చెప్పింది చేయరు.. ఎలా చెప్తావు ఎలా ఆయనతో పని చేయించుకుంటావు అని చాలామంది అన్నారని.. కానీ సెట్లో ఆయన్ని చూసి ఏంటి ఈయన ఎల్కేజీ పిల్లోడు ఉన్నట్టున్నాడు… మేమే పోరగాళ్ళం అనుకుంటే ..మాకంటే బచ్చా ఉన్నట్టు ఉంటాడు అన్నుకున్నామని శ్రీకాంత్ చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates