కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది నెలల నుంచి పొలిటికల్ గా యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. తన రాజకీయ సన్యాసంపై యూటర్న్ తీసుకొని త్వరలోనే కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన సాయిరెడ్డి.. అప్పటి నుంచి వైసీపీపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో టీడీపీపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీపై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తనను కూరలో కరివేపాకులా వాడుకొని వదిలేశారంటూ ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

2019-24 మధ్యకాలంలో తాను వైసీపీ తరఫున ఢిల్లీ వ్యవహారాలు చూసిన మాట వాస్తవమని సాయిరెడ్డి అన్నారు. అయితే, తాను ఏపీ సీఎంవోలో ప్రధాన పాత్ర పోషించాను, చక్రం తిప్పాను అని ఎవరైనా చెబితే అది అవాస్తవం అని చెప్పారు. అధికారంలోకి వచ్చే వరకు తనను వాడుకున్నారని, వచ్చిన తర్వాత కూరలో కరివేపాకులా తీసి బయట పడేసిన మాట వాస్తవం అని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, సీఎంవోలో జరిగిన విషయాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని సాయిరెడ్డి నొక్కి వక్కాణించారు.

ఇక, రెడ్ బుక్ పార్టీకి ఓటెయ్యాలా..రప్పా రప్పా పార్టీకి ఓటెయ్యాలా..కుల పిచ్చి పార్టీకి ఓటెయ్యాలా..మత పిచ్చి పార్టీకి…ఓటెయ్యాలా…లేక వేరేదైనా పార్టీకి ఓటెయ్యాలా అనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలని సాయిరెడ్డి అన్నారు. ఈ రెండు పార్టీలను ఓడించాలని, అలా ఓడించాలంటే యువత కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ముందుకు వచ్చి గళం విప్పాలని, ఒక రాజకీయ పార్టీ స్థాపించాలని కోరారు. యువతరం నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎంలు, సీఎంలు రావాలని, యువత కోరుకున్న సమాజం రావాలంటే…యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. అందుకే తన పార్టీ అధికారంలోకి వస్తే సీఎం తాను కాదు అని తన మొదటి సమావేశంలో చెప్పానని, ఇప్పుడు మళ్లీ చెబుతున్నానని అన్నారు.

2029 ఎన్నికల్లో యూపీఏతోగానీ ఇండీ కూటమితోగానీ వైసీపీ, ఎన్డీఏతో టీడీపీ పొత్తుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీలకు సిద్ధాంతాలు లేవని, రాష్ట్రాభివద్ధి, ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. ఆ రెండు పార్టీలకు పదవులే ముఖ్యమని విమర్శించారు. చంద్రబాబుకు తన కుమారుడు లోకేశ్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలన్నదే ప్రధాన కర్తవ్యం అని, జగన్ మోహన్ రెడ్డికి తన తదనంతరం తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి ఎలా తేవాలి, ఎలా సీఎం స్థానంలో కూర్చోబెట్టాలి అన్నది ఆయన ఉద్దేశ్యం అంటూ విజయ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.