ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము ఏర్పాటు చేసిన సంతాప సభకే హాజరయ్యానని స్పష్టం చేశారు.
అక్కడ అంబటి రాంబాబు కనిపించడంతో మర్యాదపూర్వకంగా పలకరించానని తెలిపారు. తనను ఇప్పటివరకు పార్టీ అధిష్ఠానం వివరణ కోరలేదని, ఒకవేళ అడిగితే తప్పకుండా ఇస్తానన్నారు. అదే సమయంలో వైసీపీ నేత జక్కంపూడి నిర్వహించిన సంతాప సభకు వెళ్లిన జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధలను కూడా వివరణ అడుగుతారా అని ప్రశ్నించారు.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ముద్రగడ ఉద్యమం ప్రధాన కారణాల్లో ఒకటని, కాపు సామాజిక వర్గం ఏ వైపు నిలిస్తే ఆ వైపే ప్రభుత్వాలు ఏర్పడతాయని బోండా ఉమ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాపు వర్గంలో అలజడి ప్రారంభమైందని, దానిని రాజకీయ పార్టీలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వివరణ ఇస్తానంటూనే పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్నే ప్రశ్నించేలా ఆయన మాట్లాడడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
బోండా ఉమ వ్యాఖ్యలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్ ఇచ్చారు. 2019లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమమే కారణమని చెప్పడం సరికాదని, వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ వైఖరిగా చిత్రీకరించవద్దని సూచించారు. వ్యక్తిగత అజెండాతో పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు.
మరోవైపు వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా స్పందించారు. కాపులు ఐక్యంగా ఉంటే చంద్రబాబుకు ఇబ్బందిగా మారుతోందని ఆరోపించారు. ముద్రగడ సంతాప సభకు అన్ని పార్టీల నేతలు హాజరయ్యారని, విషాద సందర్భంలో ఒకే వేదికపై ఉండటంలో తప్పేముందని ప్రశ్నించారు. బోండా ఉమ వ్యాఖ్యలపై అభ్యంతరాలు ఉండొచ్చని, కానీ సంతాప సభను వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. సీఎం చంద్రబాబు తనపై కోపంతోనే ఈ అంశాన్ని పెద్దది చేస్తున్నారని అంబటి విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
