ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో వారంలో ఏపీకి రానున్నారు. ఆగస్టు 1వ తేదీన ఆయన విజయనగరం జిల్లా భోగాపురానికి రానున్నారు. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ విమానాశ్రయం నిర్మాణం 99 శాతం పూర్తయింది. దీనిని గత నెలలోనే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ప్రధాని అప్పాయింట్‌మెంటు లభించకపోవడంతో దీనిని ఆగస్టు 1కి వాయిదా వేశారు.
ఇక, ప్రధాని రాక నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్లాన్ చేసింది. ప్రధాని మోడీకి స్వాగతంగా 13 వేల మందితో దేశంలోనే అతిపెద్ద థింసా నృత్య ప్రదర్శన నిర్వహించాలని అధికారులను మంత్రి లోకేశ్ సూచించారు. సభకు వచ్చే వారికి అల్పాహారం, భోజనం, తాగునీరు ఏర్పాటు చేయాలని అన్నారు. మరోవైపు ఎయిర్‌పోర్టు లోపల ఉత్తరాంధ్ర సంస్కృతి కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సుమారు లక్ష మందితో పెద్ద సభను కూడా నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు వేడుకలు నిర్వహించేలా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనూ ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్ల బాధ్యతను ఐదుగురు మంత్రులకు అప్పగించారు. ఎక్కడా చిన్నపాటి లోపం కూడా రాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు విమానాశ్రయాన్ని పరిశీలించి వచ్చారు. సభ ఏర్పాట్లపైనా వర్చువల్‌గా సమీక్షలు చేస్తున్నారు.
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించే ప్లాన్ చేస్తున్నారు. పైగా ఇది అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో వివిధ దేశాల నుంచి మీడియా కూడా రానుంది. దీంతో ఎలాంటి లోటు పాట్లు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సహా.. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

