బీజేపీలోకి గిడ్డి ఈశ్వ‌రి.. ముహూర్తం ఖ‌రారు!

గిరిజ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే.. గిడ్డి ఈశ్వ‌రి బీజేపీలో చేర‌బోతున్నారు. విద్యావంతురాలు, విన‌య‌శీలిగా పేరున్న ఈశ్వ‌రి.. ఇప్ప‌టికి మూడు పార్టీలు మారారు. ఆమె తండ్రి గిడ్డి అప్ప‌ల‌నాయుడు రాజ‌కీయ వార‌సురాలిగా అరంగేట్రం చేసిన ఈశ్వ‌రి.. పూర్వాశ్ర‌మంలో ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు. 1978 ఎన్నిక‌ల్లో గిడ్డి అప్ప‌ల‌నాయుడు.. గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గం పాడేరు నుంచి జ‌న‌తా పార్టీ టికెట్‌పై పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత చానాళ్ల‌కు ఈశ్వ‌రి రాజ‌కీయ అరంగేట్రం చేశారు. అప్ప‌ట్లో వైఎస్ పిలుపు మేర‌కు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో వైసీపీలోకి జంప్ చేశారు.

ఒక‌వైపు విన‌యం, మంచిత‌నం చూపిస్తూనే మ‌రో వైపు మంచి ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా గిడ్డి ఈశ్వ‌రి అన‌తి కాలంలోనే గుర్తిం పు తెచ్చుకున్నారు. పాడేరులోని గిరిజ‌న ప్రాంతాల్లో బాక్సైట్ త‌వ్వ‌కాలకు అనుమతిస్తే.. ఏ నాయ‌కుడి త‌లైనా న‌రుకుతాం.. అంటూ.. చంద్ర‌బాబును ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఈశ్వ‌రి గురించి తెలియ‌ని వారికి కూడా ఈశ్వ‌రి పాపుర‌ల్ అయ్యారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ సంపాయించుకుని పాడేరు నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత కూడా చంద్ర‌బాబు స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విజృంభించారు. అటు అసెంబ్లీలోను, ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ దూకుడు చూపించారు.

అయితే.. 2017లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీకి రాం రాం చెప్పి.. టీడీపీలోకి జంప్ చేశారు గిడ్డి ఈశ్వ‌రి. అయితే.. ఆశించిన ప‌ద‌వి ఆమెను వ‌రించ‌లేదు. ఈ విష‌యంలో ఈశ్వ‌రి స్వ‌యంకృత‌మే ఎక్కువ‌గా ఉంది. త‌న నియోజ‌క‌వర్గంలో అనుచ‌రుల‌తో భేటీ అయిన ఆమె పార్టీ ఎందుకు మారాల్సి వ‌చ్చిందో బ‌హిర్గ‌తం చేయ‌డం, ఆ వీడియో బ‌య‌ట‌కు రావ‌డం తో చంద్ర‌బాబు ఆమెను ప‌క్క‌న పెట్టారు. అయితే.. పార్టీలో మాత్రం ప్రాధాన్యం ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో పాడేరు టికెట్‌ను కూడా ఇచ్చారు. అయితే.. జ‌గ‌న్ సునామీ ముందు ఈశ్వ‌రి ఓడిపోయారు. ఇక‌.. అప్ప‌టి నుంచి టీడీపీలో ఉన్నా.. పార్టీకి, పార్టీ అధినేత‌కు కూడా అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అందివ‌చ్చిన నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీలో గిరిజ‌న నాయ‌కులు త‌క్కువ‌గా ఉన్నారు. ఉన్న‌వారు కూడా యాక్టివ్‌గా లేరు. ఈ నేప‌థ్యంలో గిడ్డి ఈశ్వ‌రి వంటి డోలాయ‌మానంలో ఉన్న నాయ‌కుల‌ను బీజేపీ టార్గెట్ చేసింది. ఇలాంటి వారిని ఎంచుకుని చ‌ర్చ‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే బీజేపీలో చేరేందుకు గిడ్డి ఈశ్వ‌రి రెడీ అయ్యార‌ని పాడేరు వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ముహూర్తం ఎప్పుడు? అనేది మాత్రం స‌స్పెన్స్‌గా ఉంది. గిడ్డి ఈశ్వ‌రి రాక‌తో గిరిజ‌నులు బీజేపీకి చేరువ అవుతారా? ఆ పార్టీ వ్యూహం ఫ‌లిస్తుందా? ఏం జ‌రుగుతుంది? అనేది చూడాలి.