కేటీఆర్ ను భయపెట్టిన ‘పులివెందుల’

రాయలసీమ పేరు చెప్పగానే గతంలో ఫ్యాక్షనిజం గుర్తుకు వచ్చేది. కాలక్రమంలో చాలావరకు ఫ్యాక్షన్ హత్యలు, కక్షలు, కార్పణ్యాలు తగ్గిపోయాయి. అయినా సరే ఇప్పటికీ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పగానే ఫ్యాక్షన్ నేపథ్యం గుర్తుకు వస్తుంది.

ఆ ప్రాంతం వ్యక్తులు కొంత గంభీరంగా కనిపిస్తే చాలు.. ఎదుటి మనిషి మనకెందుకులే అని గమ్మునుంటారు. ఇటువంటి ఒక అనుభవమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఎదురైంది. పులివెందులకు చెందిన ఒక వ్యక్తి తన మెడపై కత్తి పెట్టిన సందర్భంలో తాను సైలెంట్ అయ్యానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ జైల్లో తనకు ఎదురైన అనుభవాన్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ జైల్లో ఒక వ్యక్తి తనకు షేవింగ్ చేస్తున్నాడని, ఏ ఊరు అని అడిగితే పులివెందుల అని చెప్పాడని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. సరిగ్గా కత్తి తన గొంతు దగ్గర ఉండగానే పులివెందుల పేరు చెప్పారని, మనకెందుకులే అన్న భయంతో తాను సైలెంట్ అయ్యానని చెప్పారు. తన పరిస్థితి చూసిన ఆ వ్యక్తి కూడా నవ్వాడని అన్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇలా పులివెందుల పేరు చెప్పగానే కేటీఆర్ అంతటి వ్యక్తి కూడా భయపడ్డారని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక, వైఎస్సార్, జగన్ లపై కూడా ఫ్యాక్షన్ ముద్ర ఉందని, వారికి భయపడే చాలామంది వారికి వ్యతిరేకంగా నోరు మెదపరని మరికొందరు నెటిజన్లు తమ అభిప్రాయలు వెల్లడిస్తున్నారు. ఇక, ఏపీలో చాలామంది వైసీపీయేతర నేతలు జగన్ వి ఫ్యాక్షన్ రాజకీయాలని, వివేకా హత్య కేసు అందుకు ఉదాహరణ అని విమర్శిస్తుంటారని నెటిజన్లు అంటున్నారు.