విజయ్ సర్కార్‌ను కూల్చే కుట్ర… ఏంటి ఈ ప్రాజెక్ట్ మేఘాలయ?

తమిళనాడులో హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రాజెక్ట్ మేఘాలయ పేరుతో కొందరు వ్యక్తులు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు భారీగా నగదు ఆశచూపి వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించినట్లు చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ కేసులో భాగంగా దాదాపు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను సంప్రదించే ప్లాన్ లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఊతంగరై టీవీకే ఎమ్మెల్యే ఎన్.ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఐపీడీఎస్ అనే ఒపీనియన్ పోలింగ్ సంస్థను నడుపుతున్న యూట్యూబర్ తిరునావుక్కరసు తనకు రూ.35 కోట్ల ఆఫర్ చేశాడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ విప్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓటు వేయాలని వారు కోరారని, దానికి తాను అంగీకరించకపోవడంతో తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా బెదిరించారని ఎమ్మెల్యే ఆరోపించారు.

ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ని కూడా జులై 15, 16 తేదీల్లో విచారించి ఆయన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు తిరునావుక్కరసుతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. అయితే సరైన విధానాన్ని పాటించకుండా ఓ జర్నలిస్టును అర్ధరాత్రి వరకు విచారించారని చెన్నై ప్రెస్ క్లబ్ ఆరోపిస్తూ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించింది. పోలీసులు మాత్రం చట్టప్రకారమే దర్యాప్తు కొనసాగిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, డీఎంకే నేత సెంథిల్ బాలాజీతో పాటు ఆయన సోదరుడు అశోక్‌కు కూడా పోలీసులు సమన్లు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. అయితే తమపై వస్తున్న ఆరోపణలను డీఎంకే పూర్తిగా ఖండించింది. రాజకీయ లబ్ధి కోసమే టీవీకే పార్టీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని, దీనిపై చట్టపరంగానే స్పందిస్తామని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఇక ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ పేరుతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి.