హైదరాబాద్‌ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక రూపంలో డ్రగ్స్‌సరఫరా జరుగుతూనే ఉంది. అయితే.. ఈ డ్రగ్స్ కోసం.. ప్రజా ప్రతినిధుల కుటుంబాల్లోని వ్యక్తులు వస్తుండడం.. అర్ధరాత్రి, అపరాత్ర తేడా లేకుండా ఎగబడుతుండడం వంటివి అత్యంత దారుణంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, వారి సన్నిహితులు డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
తాజాగా బుధవారం రాత్రి ఈగల్ టీం చేసిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఓ ప్రముఖ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కుమారుడు డ్రగ్స్ కోసం ఎగబడుతూ.. పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. మంగళ్ హాట్ పరిధిలో ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగదారుల అలికిడి పెరిగిపోయింది. దీంతో ఈగల్ సిబ్బంది ఈ ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో రాత్రి వేళల్లో మారు వేషాల్లో సిబ్బంది ఇక్కడ గస్తీకాస్తూ.. డ్రగ్స్ కోసం వచ్చే వారిని, విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
బుధవారం రాత్రి కూడా ఇలానే.. ఈగల్ టీం గస్తీ పెంచింది. ఈ క్రమంలో అర్ధరాత్ర 1 గంట తర్వాత.. కొందరు కుర్రాళ్లు ఇక్కడ సంచరించడంతో వారిని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన తర్వాత.. వారి వివరాలు సేకరించగా.. ఓ వ్యక్తి ఎమ్మెల్యే కుమారుడని స్పష్టమైంది. దీంతో ఈగల్ అధికారులు అవాక్కయ్యారు. ఆ వెంటనే వీరిని వైద్య పరీక్షలకు పంపించారు. అదేసమయంలో రక్త నమూనాలను కూడా సేకరించారు.
రాజకీయంగా కలకలం!
డ్రగ్స్ కోసం వచ్చిన వ్యక్తుల్లో ఎమ్మెల్సీ కుమారుడు ఉన్నాడన్న వార్త వెలుగులోకి రావడం రాజకీయంగా కలకలం సృష్టించింది. అయితే.. ఏ పార్టీ వ్యక్తి అనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. మరోవైపు ఈ విషయం అటు అధికార కాంగ్రెస్‌లోను.. ఇటు విపక్ష బీఆర్ ఎస్‌లోను చర్చకు దారి తీసింది. పలువురు నాయకులు ఫోన్లు చేసి.. సంబంధిత వ్యక్తి ఎవరని ఆరా తీశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates