మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు మరోసారి పాదయాత్రలను ప్రధాన రాజకీయ ఆయుధంగా ఎంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు రెండేళ్ల ముందు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.
దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రధాన పార్టీలు ప్రజలతో నేరుగా మమేకమయ్యే వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. రానున్న ఎన్నికల రాజకీయాల్లో ఈ పాదయాత్రలు కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జగన్‌కు పాదయాత్ర కొత్త కాదు. 2019 ఎన్నికలకు ముందు 2017 నవంబర్‌లో ప్రారంభించిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ను 2019 జనవరిలో ముగించారు. 341 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో ఆయన 3,648 కిలోమీటర్లకు పైగా నడిచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుసుకున్నారు. ఆ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు కేటీఆర్ కు ఇది తొలి పాదయాత్ర కానుంది. ఇప్పటివరకు ఆయన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు బీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయిలో పునర్వ్యవస్థీకరించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడం, రానున్న ఎన్నికలకు సంస్థాగతంగా సిద్ధమవడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ప్రజల స్పందనను బట్టి ఈ యాత్రలు రానున్న ఎన్నికల రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates