ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరించిన ముద్రగడ కుటుంబం

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున నిర్ణయించారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పద్మనాభం అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని ఆయన కుటుంబం తిరస్కరించింది.

అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని ముద్రగడ కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. జూలై 15వ తేదీ సాయంత్రం కిర్లంపూడిలో పద్మనాభం అంత్యక్రియలు జరుపేందుకు ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారని తెలిపారు. ముద్రగడ బ్రతికి ఉన్న సమయంలో ఆయనను అనేక అవమానాలు, వేధింపులకు గురి చేశారని, అందుకే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను వారి కుటుంబ సభ్యులు తిరస్కరించారని వెల్లడించారు.

ముద్రగడ ఏనాడూ పదవుల కోసం ఆరాటపడిన వ్యక్తి కాదని, ప్రజా సమస్యలపై పోరాడిన మనిషి అని చెప్పారు. అటువంటి ప్రజా నాయకుడిని బ్రతికి ఉన్నప్పుడు వేధించిన ప్రభుత్వం ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.