రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ పెట్టుబడికి రెడీ అయింది. 3000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో రాయలసీమలో ప్లాంటు పెట్టేందుకు సిద్ధమైంది. కడపలో దీనిని స్థాపించనున్నారు. మంత్రి నారా లోకేష్.. దీనికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇటీవల కాలంలో కడప సహా కర్నూలు, అనంత పురంపై కూటమి సర్కారు ఫోకస్ పెట్టింది.
ఇప్పటికే సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ లు క్యూ కట్టాయి. ఈ ఏడాది మే 22న జమ్మల మడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలో సేల్ సౌర విద్యుత్ ప్రాజెక్టును విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు 2 నెలల వ్యవధిలోనే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.
స్థానికులకు ఉద్యోగాలు..
దాల్మియా సిమెంట్ పరిశ్రమ 3,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ విస్తరణతో ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మంది ఉపాధి పొందుతుండగా.. ప్లాంట్ విస్తరణతో కొత్తగా మరో 700 మందికి ఉపాధి లభిస్తుంది. మొత్తంగా 1,650 మందికి ఉపాధి, ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ పెట్టుబడుల వల్ల అనుబంధ పరిశ్రమల్లో కూడా అదనపు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
ప్రస్తుతం సంస్థ పన్నులు, మైనింగ్ రాయల్టీల రూపంలో రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.102 కోట్లు చెల్లిస్తోంది. ప్రతిపాదిత విస్తరణ పూర్తైన తర్వాత ఈ వార్షిక ఆదాయం రూ.325 కోట్లకు పెరుగుతుంది. దాల్మియా సంస్థ రెండో దశ విస్తరణ పనులను అత్యుత్తమ ప్రమాణాలతో గ్రీన్ ఇండస్ట్రీగా మార్చేందుకు కృషి చేయనుంది. సిమెంట్ పరిశ్రమకు అవసరమైన 80శాతం విద్యుత్ ను పునరుత్పాదక విధానంలో తీసుకోనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates