పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని భవిష్యత్తులో తాను నిజం చేస్తానని కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జనాభాను నియంత్రించడం సరికాదని తేల్చి చెప్పారు. జనాభాను సంరక్షించే విధానాలు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఉత్తమ విద్య, ఆర్థిక వనరుల పెంపు వంటివాటికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ముగ్గురు బిడ్డలను కంటే 30 వేలు, నలుగురు పిల్లలను కంటే 40 వేల చొప్పున ఇస్తామని మరోసారి చెప్పారు.
విజయవాడలో శనివారం నిర్వహించిన `ప్రపంచ జనాభా దినోత్సవం`లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణకు తాను కూడా ప్రాధాన్యం ఇచ్చానని తెలిపారు. కానీ, నేడు సంపదగా చెబుతున్నానన్నారు. ఆదాయ వనరులు పెరుగుతున్నాయని.. పిల్లలుకూడా అందులో భాగమేనని వ్యాఖ్యానించారు. గతంలో ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించారని, కానీ, ఇప్పుడు ఆ నిబంధనను తాము ఎత్తేశామని, ఎంతమంది పిల్లులు ఉన్నా.. అందరూ అర్హులేనని చెప్పారు.
ఆడపిల్లలు భారం కాదు!
ఒకప్పుడు ఆడపిల్లలు అంటే మధ్యతరగతి కుటుంబాల వారు భారంగా భావించే వారని, దీనికి కారణాలు అనేకం ఉన్నాయని సీఎం చెప్పారు. అయితే, మారుతున్న కాలంతోపాటు.. అధునాతన సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. దీంతో ఆడపిల్లలు కూడా ఉన్నత విద్యలు చదువుతున్నారని, ఉన్నత ఉద్యోగాలు కూడా చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కట్నం ఇచ్చే పరిస్థితి పోయిందని, ఎదురు కట్నం ఇచ్చే రోజులు వచ్చాయని చమత్కరించారు. ప్రస్తుతం ఇద్దరు కాదు.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత సంపద ఉన్నట్టేనని తెలిపారు. దేశంలోను, రాష్ట్రంలోనూ ఆ తరహా ఆలోచన రావాలని సూచించారు.
వృద్ధులు పెరుగుతున్నారు!
దేశంలో వృద్ధుల సంఖ్య రానున్న 30 ఏళ్లలో బారీగా పెరుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది పెను సవాల్‌గా మారుతుందన్నారు. చైనా, జపాన్ వంటి దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. ఇప్పుడు అక్కడ పిల్లలను కంటే పథకాలను అమలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. మనదేశంలో ఇప్పుడే ఈ విషయంపై చర్చ జరగాలని తాను పిలుపునిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోందని, ఇది ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. పిల్లలు వద్దని అనుకుంటే.. సంపద వద్దని అనుకున్నట్టేనని చప్పారు. పిల్లలను పెంచే బాధ్యతను తండ్రులుల కూడా తీసుకోవాలని సూచించారు. “ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. స్వర్ణాంధ్ర -2047 కాదు.. స్వర్ణాంధ్ర -2040కే సాధిస్తామన్న భావన కలుగుతోంది“ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates