కేటీఆర్ పాద‌యాత్ర పోస్ట్ పోన్‌… ?

తెలంగాణ‌లో మూడోసారి బీఆర్ఎస్ ప్ర‌భుత్వ ఏర్పాటే ల‌క్ష్యంగా ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఈ ఏడాది నుంచే ఆ పాద‌యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. దీనిపై కేటీఆర్ .. పార్టీలోనూ.. త‌న కుటుంబంలోనూ చ‌ర్చించినట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. రాజ‌కీయంగా పాద‌యాత్ర ఏమేర‌కు త‌మ‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌న్న విషయంపైనా ఆయ‌న ఆరా తీశారు. అధికారంలోకి వ‌చ్చేందుకు ఇది ఎంత‌వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న‌ది కూడా తెలుసుకున్నారు.

పాద‌యాత్ర చేయ‌డం ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం ఒక భాగ‌మైతే.. మ‌రోవైపు పార్టీని డెవ‌లప్ చేసుకోవ‌డం మ‌రో ల‌క్ష్యంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే పాద‌యాత్ర‌కు కేటీఆర్ తొలిసారి ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న చ‌ర్చ కూడా ఉంది. మ‌రోవైపు కేసీఆర్ సైతం బ‌స్సు యాత్ర చేస్తార‌ని పార్టీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. దీనిని కేటీఆర్ కూడా ఔన‌నే చెప్పారు. సో.. అటు కేటీఆర్‌, ఇటు కేసీఆర్ ఏక‌కాలంలో ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చి.. త‌ద్వారా మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేయ‌డం ఖాయ‌మ‌న్న‌ బీఆర్ఎస్ వ‌ర్గాల మాట‌.

అయితే… ఇప్పుడు రెండు యాత్ర‌లు కూడా వాయిదా ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ చెప్పిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లో ఆమేర‌కు అవ‌స‌ర‌మైన రాజ‌కీయ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదని దీంతో ఇప్పుడు పాద‌యాత్ర చేసినా విఫ‌ల ప్ర‌య‌త్న‌మే అవుతుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం సీఎం రేవంత్ రెడ్డిపై ప్ర‌జ‌ల్లో ఎక్క‌డా మొహం మొత్త‌లేదు. పైగా.. ప్ర‌భుత్వ వాద‌న విష‌యంలో ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటున్న ప‌రిస్థితి కూడా  క‌నిపిస్తోంది.

దీంతో ఇప్ప‌టికిప్పుడు స‌ర్కారుపై వ్య‌తిరేక‌త లేద‌న్న‌ది సుస్ప‌ష్ట‌మ‌వుతోంది. స‌హ‌జంగా ఇలాంటి పాదయాత్ర‌లు.. ప్ర‌జ‌ల్లో స‌ద‌రు ప్ర‌భుత్వాల‌పై వ్య‌తిరేక‌త ప్రారంభ‌మైన‌ప్పుడు చేప‌డితే ఫ‌లితం ఆశించినట్టుగా ఉంటుంది. కానీ, ఇప్పుడు తెలంగాణ‌లో కేటీఆర్ ఆశించిన‌ట్టుగా వ్య‌తిరేక‌త క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి విష‌యంలో మ‌రింత సానుకూలంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న పేరు వినిపిస్తుండ‌డంతో త‌న పాద‌యాత్ర స‌హా కేసీఆర్ బ‌స్సు యాత్ర‌ల‌ను వ‌చ్చే ఏడాదికి పోస్టు పోన్ చేసుకున్నార‌ని తెలుస్తోంది. అయితే.. దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.