జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం రాత్రి కన్నుమూశాడు. హనుమకొండ హనుమాన్‌నగర్‌కు చెందిన నిరంజన్ అరుదైన జన్యుపరమైన డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధితో చిన్నప్పటి నుంచే పోరాడుతున్నాడు. కొంతకాలంగా చికిత్స పొందుతున్న అతడు ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. ఈ వార్త కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
నిరంజన్ మూడేళ్ల వయసులోనే ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. అప్పటి నుంచే మంచానికే పరిమితమయ్యాడు. వ్యాధి తీవ్రత కారణంగా 17 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ నాలుగేళ్ల చిన్నారి రూపంలోనే ఉండిపోయాడు. అయితే తన అభిమాన నటుడు, నాయకుడు పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి అయినా కలవాలన్న కోరికను మాత్రం ఎప్పుడూ వదల్లేదు.
ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గత నెల 17న స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని అందజేసి, అతని ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు. నిరంజన్‌తో ఆప్యాయంగా మాట్లాడి, అతని అభిరుచులు తెలుసుకున్నారు.
జనసేన డైరీపై “ప్రియమైన నిరంజన్‌కు ప్రేమతో… అమ్మ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ…” అంటూ స్వహస్తాలతో సందేశం రాసి సంతకం చేశారు. అలాగే ఆర్థిక సాయం అందించి, కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చారు. “ఓజీ సినిమా ఇద్దరం కలిసి చూద్దాం” అంటూ ధైర్యం చెప్పిన ఆ క్షణాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
కానీ విధి మరోలా తీర్పు చెప్పింది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో నిరంజన్ మంగళవారం రాత్రి కన్నుమూశాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నెరవేరకముందే అతని జీవన ప్రయాణం ముగియడం అభిమానులను కలచివేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates