మంత్రి తప్పుకి అసెంబ్లీలో సారీ చెప్పిన సీఎం

చట్టసభలను గతంలో చాలామంది నేతలు దేవాలయాలుగా భావించేవారు. ప్రజల జీవితాలను మార్చగలిగే చట్టాలను చేసేందుకు తమకు అధికారం ఇచ్చారని జవాబుదారీతనంగా ఉండే నేతలు గతంలో చాలామంది ఉన్నారు. కానీ, కాలగమనంలో చట్టసభలు వన్నె కోల్పోయాయి.

చట్టసభలలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవడం, వీలైతే వారి కుటుంబ సభ్యులను కూడా చట్టసభలకు లాగడం, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననాలు వంటివి ఈ తరం రాజకీయ నాయకులలో చాలామందికి పరిపాటిగా మారిందంటే అతిశయోక్తి కాదు.

అయితే, పొరపాటున నోరు జారి ఆవేశంలో ఏదైనా మాట అంటే ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించాలని కోరిన నేతలు కూడా కొందరు ఉన్నారు. కానీ, తమ పార్టీకి చెందిన మంత్రి నోరు జారితే ఆయన తరఫున క్షమాపణలు చెప్పిన సభాపక్ష నేతలు మాత్రం చాలా అరుదు. ఆ అరుదైన జాబితాలో తమిళనాడు సీఎం విజయ్ తాజాగా చేరారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో సైతం ఇటువంటి నేతలున్నారు అని నిరూపించిన విజయ్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ సీఎం కరుణానిధి పేరుని అటవీశాఖ మంత్రి రంజిత్‌కుమార్ మర్యాద లేకుండా సంభోదించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై విపక్ష డీఎంకే సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలు చేసిన మంత్రి తరఫున డీఎంకే సభ్యులకు సీఎం విజయ్ సభలోనే బేషరతుగా క్షమాపణలు కోరారు.

తన మంత్రి చేసిన తప్పునకు సభాపతి సమక్షంలో అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని సీఎం విజయ్ ప్రకటించి ఆ వివాదానికి తెరదించారు. ఈ నేపథ్యంలోనే విజయ్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నవశకం రాజకీయాలలో ఈ తరహా మంచి సంస్కృతికి విజయ్ నాంది పలికారని, దేశంలోని ఎందరో రాజకీయ నాయకులకు విజయ్ ఆదర్శప్రాయమని కొనియాడుతున్నారు.