తెలంగాణలో ఎన్ని ఓట్లు పోతాయి స‌ర్‌

కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ ప్ర‌క్రియ‌(స‌ర్‌) తెలంగాణ‌లో ముగిసింది. దాదాపు 2 మాసాల‌కు పైగానే ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టారు. మ‌ధ్య‌లో రెండు సార్లు పొడిగించారు. తాజాగా తుది జాబితాను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సోమవారం విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం.. 73 ల‌క్ష‌ల ఓట్లు న‌కిలీవ‌ని ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి సుద‌ర్శ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ప్ర‌స్తుతం విడుద‌ల చేసిన‌ జాబితాలో వీరి పేర్లు ఉంటాయ‌ని.. అయితే.. తుది జాబితాల్లో వారి పేర్ల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు తెలిపారు.

అంతేకాదు.. 73 ల‌క్ష‌ల మందికి త్వ‌ర‌లోనే నోటీసులు అందించ‌నున్నట్టు సుద‌ర్శ‌న్‌రెడ్డి చెప్పారు. వీరిలో ఏ ఒక్క‌రి ఓటును ఉద్దేశ పూర్వ‌కంగా తొల‌గించ‌బోమ‌ని.. అడ్ర‌స్‌, రెండు చోట్ల ఒక్క‌రికే ఓటు ఉండ‌డం, న‌కిలీ పేర్ల‌తో న‌మోదు కావ‌డం, వ‌ల‌స‌లు వంటివాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. 73 ల‌క్ష‌ల మందికి నోటీసులు ఇచ్చిన త‌ర్వాత‌.. వారి స‌మాధానం చూసి తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. అదేస‌మ‌యంలో మ‌రో 92 ల‌క్ష‌ల మంది పేర్లు త‌ప్పుగా న‌మోద‌య్యాయ‌ని.. వారి ఓట్లు ఉన్నాయ‌ని తెలిపారు. వీరికి కూడా నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

కొత్త ఓట్ల‌కు కూడా..

ప్ర‌స్తుతం స‌ర్ ప్ర‌క్రియ‌..(ఇంటింటికీ తిరిగి న‌మోదు చేసేది)ముగిసింద‌ని సుద‌ర్శ‌న్ రెడ్డి చెప్పారు. త్వ‌ర‌లోనే కొత్త ఓట‌ర్లు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను వెబ్ సైట్‌లో న‌మోదు చేసుకునేందుకు అవ‌కాశం ఇస్తామ‌న్నారు. 6ఏ ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో అందుబాటు లో ఉంచుతామ‌న్నారు. ప్ర‌స్తుతం ముగిసిన ముసాయిదా ఓట‌ర్ల జాబితాల‌ను కూడా మండ‌లాల వారీగా ప్ర‌చురించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఈ నెల చివ‌రి వ‌ర‌కు అభ్యంత‌రాలు స్వీక‌రిస్తామ‌ని.. తుది జాబితాల‌ను ప్ర‌క‌టిస్తామ‌న్నారు. ఏ స‌మాచారం కావాల‌న్నా.. బీఎల్ ఏ(బూత్ లెవిల్ అధికారి)ల‌ను సంప్ర‌దించాల‌ని కోరారు.