ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చీటింగ్ సహా.. నమ్మక ద్రోహం, రెచ్చగొట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం వంటి ఆరోపణలు చేశారు. తక్షణమే పవన్ కల్యాణ్‌పై కేసు పెట్టాలని ఆమె పోలీసులకు విన్నవించారు. లేకపోతే.. తాను హైకోర్టును ఆశ్రయిస్తానని ఆమె చెప్పడం గమనార్హం. ఈ మేరకు సోమవారం గన్నవరం పోలీసు స్టేషన్‌కు వచ్చిన సుగాలి ప్రీతి తల్లి.. పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదును అందించారు.
ఏం జరిగింది?
2017-18 మధ్య ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఆమె చదువుతున్నారు. ఆమెపై లైంగిక దాడి జరిగి.. తర్వాత హత్య కూడా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం… 2019 ఎన్నికలు సహా.. 2024 ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ విషయంపై అప్పట్లోనే పవన్ కల్యాణ్ సుగాలి ప్రీతి తల్లిని ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాను అధికారంలోకి రాగానే.. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు పార్వతీదేవి చెబుతున్నారు.
అయితే.. కూటమి అధికారంలోకివచ్చి.. రెండేళ్లయినా.. తనకు న్యాయం చేయలేదని.. కనీసం తమ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా కూడా రావడం లేదని పార్వతీదేవి తరచుగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు.. చేశారు. గన్నవరం పోలీసులను ఆశ్రయించిన సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి.. చీటింగ్, నమ్మక ద్రోహం సహా పలు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
అధికారంలోకి వస్తే మొదటి సంతకం ‘సుగాలి ప్రీతి’ కేసుపైనే పెడతానని పవన్ కల్యాణ్ తనకు హామీ ఇచ్చారని పార్వతీ దేవి వ్యాఖ్యానించారు. అయితే.. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాట మార్చారని ఆమె ఆరోపించారు. పైగా తనపై ఓ పార్టీకి చెందిన నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె చెప్పారు. ఈ విషయంలో పోలీసులు తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నట్టు తెలిపారు. వారు న్యాయం చేయకపోతే.. హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates