కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఇటీవల తెలంగాణా భవన్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారని, కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతుంది. 

వరంగల్ జిల్లా పరకాల లో ఆదివారం జరిగిన ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇటీవల తెలంగాణా భవన్లో నిర్వహించిన రక్తదానం గురించి ప్రస్థావించారు. అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలు రక్త దానం చేస్తే వాటిని కెసిఆర్, హరీష్ రావు ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయలు దండుకున్నారని విమర్శించారు.  ఈ కార్యక్రమంలో అయినా కేటీఆర్, హరీష్ రావు రక్త దానం చేస్తారేమో అనుకుంటే చేయలేదన్నారు.  అప్పుడైనా తిన్నది కరుగుతుందన్నారు. 

అధికారంలో వున్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రతిపక్షంలో ఉండి సొంత పార్టీ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకొని సంపాదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ కుటుంబానికి దోపిడీ అలవాటై పోయిందన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వినోద్, సంతోష్ రావులు ఎందుకు రక్తదానం చేయలేదని ప్రశ్నించారు. వీళ్ళు మనుషులా, రక్త పీపాసులా అని మండిపడ్డారు. 

సీఎం విమర్శలను కాంగ్రెస్ పార్టీ కేడర్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అబ్బా కొడుకులు ఇద్దరూ దొంగలేనని, చివరికి కార్యకర్తల రక్తాన్ని కూడా విడిచిపెట్టలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య విమర్శల యుద్ధం జరుగుతుంది.