కూతురికి ప్లాపొచ్చినా తల్లికి హిట్టు దక్కింది

గత నెల చివరి వారంలో వచ్చిన శ్రీనివాస మంగాపురం ప్రేక్షకులకు గుర్తే. ఘట్టమనేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జయకృష్ణకు తొలి అడుగులోనే పెద్ద ఫ్లాప్ పడింది. తన వయసుకి మించి కమర్షియల్ సబ్జెక్టు రాసుకోవడంతో దర్శకుడు అజయ్ భూపతి దాన్ని సరిగ్గా బ్యాలన్స్ చేయలేక నిరాశ పరిచారు. ఇదే సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన రశ తదాని తన డెబ్యూ మీద బోలెడు ఆశలు పెట్టుకుంది. టాలీవుడ్ లో మంచి బ్రేక్ దక్కాలని గట్టిగానే కోరుకుంది. కానీ నెరవేరలేదు.

రశ తదాని తల్లి రవీనాటాండన్ కు ఎప్పటి నుంచో తెలుగుతో బాండింగ్ ఉంది. బాలకృష్ణ బంగారు బుల్లోడు రూపంలో మర్చిపోలేని హిట్టు ఉంది. నాగార్జున ఆకాశవీధిలో నిరాశ పరిచిన తర్వాత పూర్తిగా హిందీ సినిమాలకే అంకితమైపోయారు. పాండవులు పాండవులు తుమ్మెద కోసం 2014లో మంచు ఫ్యామిలీ కోసం రీ ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ దక్కలేదు. సరే ఇదంతా ఇప్పుడెందుకనే పాయింట్ కు వద్దాం. రవీనా గత కొంత కాలంగా సపోర్టింగ్ ఆర్టిస్టుగా చెప్పుకోదగ్గ పాత్రలు చేస్తున్నారు.

కెజిఎఫ్ లో ఇందిరా గాంధీని పోలి ఉండే ప్రధాని క్యారెక్టర్ లో మంచి ఛాయస్ అనిపించుకున్నాడు. పార్ట్ 2లో మాత్రమే కనిపించినప్పటికీ తన ఉనికిని చాటుకున్నారు. తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో హీరో సూర్యకు సవతి తల్లిగా కాస్త చెప్పుకోదగ్గ స్పేస్ దక్కించుకున్నారు. రాధికా శరత్ కుమార్ డామినేషన్ లో రవీనా అంతగా హైలైట్ కాలేకపోయినా దర్శకుడు వెంకీ అట్లూరి లిమిటెడ్ స్పేస్ లోనే మంచి సన్నివేశాలు వచ్చేలా చూసుకున్నారు. దీంతో కూతురికి ఫ్లాప్ దొరికిన రెండు వారాల్లోపే తల్లికి దక్కినట్టయింది.

ఒకరకంగా చెప్పాలంటే సౌత్ మూవీస్ లో రవీనాటాండన్ లక్కీ సెంటిమెంట్ గా మారుతోందేమో. విచిత్రంగా ఆవిడ నటించిన హిందీ సినిమాలు మాత్రం వర్కౌట్ కావడం లేదు. ఈ మధ్య వెల్కమ్ టు ది జంగల్ లో కనిపించారు. అది సోసోగానే ఆడింది. అంతకు ముందు ఏడాది గ్యాప్ ఉంది. ఈ పదేళ్ల కాలంలో పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు. మరి ఇప్పుడు సౌత్ సైడ్ మంచి కెరీర్ బ్రేక్స్ వస్తున్నాయి కాబట్టి ఫుల్ టైం సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారితే మటుకు అవకాశాలు వస్తాయి.