సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. పాలనా రాజధానిగా మాత్రమే అమరావతిని కొనసాగించేందుకు మొగ్గు చూపిన జగన్….మూడు రాజధానులంటూ కొత్త రాగం అందుకున్నారు. దీంతో, అమరావతి కోసం వేల ఎకరాలిచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. 3 రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ ఏడాది నుంచి ఆందోళనలు, దీక్షలు కొనసాగిస్తోన్నారు.
అయినప్పటికీ జగన్ తన మొండి వైఖరిని వీడకుండా రైతుల ఉద్యమాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంత గ్రామాల సంఖ్యను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి పరిధిలో 5 గ్రామాలను వార్డులుగా మార్చివేసి వాటిని మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల పరిధిలోకి తీసుకొచ్చింది. వీటితోపాటు కొత్త మున్సిపాలిటీ, మరో అయిదు నగర పంచాయతీలను ఏర్పాటు చేసింది.
అమరావతి పరిధిలోని ఉండవల్లి, పెనుమాక, నవులూరు, ఎర్రబాలెం, నిడమర్రు, బేతపూడి గ్రామాలు మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. నవులూరు, ఎర్రబాలెం, నిడమర్రులను మంగళగిరి మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాలను తాడేపల్లి పరిధిలోకి వచ్చాయి. దీంతో అమరావతి పరిధిలో గ్రామాల సంఖ్య 29 నుంచి 23కు పడిపోయింది. విజయవాడ శివార్లలోని తాడిగడప.. కొత్త మున్సిపాలిటీగా మారింది. కానూరు, పోరంకి, యనమలకుదురు, తాడిగడప ప్రాంతాలను దీని పరిధిలోకి వస్తాయి. తాడిగడపకు వైఎస్సార్ తాడిగడపగా నామకరణం చేశారు.
అలాగే, పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి, విజయనగరం జిల్లాలోని రాజాం, చిత్తూరు జిల్లా బీ.కొత్తకోట, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా పొదిలిలను నగర పంచాయతీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్‌లలో మరిన్ని గ్రామాలను చేర్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, తాడేపల్లి గూడెం, భీమవరం, తణుకు, గుంటూరు జిల్లాలోని బాపట్ల, పొన్నూరు, ప్రకాశం జిల్లా కందూకూరు, నెల్లూరు జిల్లా కావలి, గూడురు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీల పరిధిని మరింత విస్తృతం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates