జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల తరచుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య హఠాత్తుగా ఆయనకు ఒక శస్త్రచికిత్స జరగడం.. కొన్ని రోజుల పాటు కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. దాని గురించి తర్వాత పవనే స్వయంగా వెల్లడించాడు. అభిమానులు చూపించిన అతి ప్రేమ వల్ల బాడీలో అక్కడక్కడా చీలికలు వచ్చాయని, వాటికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.
ఐతే తాజాగా పవన్ ఉన్నట్లుండి భార్య అనా లెజ్‌నెవాతో కలిసి ముంబయిలోని ధీరూబాయి అంబానీ ఆసుపత్రికి వెళ్లడం.. అక్కడ ఆయనకు శస్త్ర చికిత్స జరుగుతున్నట్లు వార్తలు రావడం అభిమానులను కలవరపెట్టింది. ఈసారి జరుగుతున్న సర్జరీ వెన్నునొప్పికి సంబంధించి అని వెల్లడైంది. ఐతే ఈ సమస్య కొత్తదేమీ కాదు. ఎన్నో ఏళ్ల నుంచి పవన్ ఈ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.
‘గబ్బర్ సింగ్’ షూటింగ్ సమయంలోనే పవన్ వెన్ను నొప్పితో ఎలా నరకం అనుభవించిందీ ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించాడు. ఒకట్రెండు సంవత్సరాలు కాదు.. 15 ఏళ్లుగా పవన్ వెన్ను నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తనకు తెలుసని బండ్ల వ్యాఖ్యానించాడు.
‘గబ్బర్ సింగ్’ షూటింగ్ జరుగుతుండగా.. గుజరాత్‌లో గుర్రం మీది నుంచి పవన్ పడిపోయారని.. అప్పుడు వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారని.. కానీ ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు, నిర్మాతకు ఇబ్బంది రాకుండా ముందు షూటింగ్ పూర్తి చేద్దామని పవన్ ఆ నొప్పిని భరిస్తూనే షూటింగ్ పూర్తి చేశారని.. సినిమా రిలీజయ్యే వరకు తమకు అండగా నిలిచారని బండ్ల గుర్తు చేసుకున్నాడు.
ఇప్పుడు పవన్ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే తన గుండె ముక్కలవుతోందని.. ఆ రోజు పవన్ బాధను తాను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో అనిపిస్తోందని బండ్ల అన్నాడు. ఇకపై పవన్‌కు పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగా గడపాలని బండ్ల ఆకాంక్షించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates