ఎవరీ ఐఏఎస్ శ్రీలక్ష్మి?

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్ దక్కింది. ప్రస్తుతం ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణిగా కొనసాగుతున్న శ్రీలక్ష్మిని సాధారణ పరిపాలనా శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండేళ్లుగా పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉన్న ఆమెకు చివరాఖరుకు పోస్టింగ్ దక్కిందన్న వాదన వినిపిస్తోంది.

కొత్తగా దక్కిన ఈ పోస్టులో శ్రీలక్ష్మి కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నారు. ఎందుకంటే.. ఈ నెలాఖరున ఆమె పదవీ విరమణ చేయనున్నారు. అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారులు గౌరవ ప్రదంగా రిటైర్ అయ్యేందుకే వారిపై ఎన్ని ఆరోపణలు ఉన్నా… వారి సర్వీసు చివరలో పోస్టింగ్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కీలకమైన కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మికి కూటమి సర్కారు చివరాఖరులో పోస్టింగ్ ఇచ్చిందని చెప్పాలి.

1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి.. సమర్ధవంతమైన అధికారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా… గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీలక్ష్మి పనిచేశారు. ఆ సమయంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి ఓబుళాపురంలోని గనులను కేటాయించిన వ్యవహారంలో శ్రీలక్ష్మి కీలక చర్యలు చేపట్టారు. నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా ఆమె నడుచుకున్నారు. ఫలితంగా సర్కారీ ఆదాయానికి భారీగా గండి పడింది.

ఓబుళాపురం మైనింగ్ లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై కేసు నమోదు కాగా… గాలి జనార్ధన్ రెడ్డితో పాటు నాడు ఏపీ గనుల శాఖలో కీలకంగా పనిచేసిన శ్రీలక్ష్మి, వీడీ రాజగోపాల్, కృపానందం తదిరరులపై భారీ ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే గాలితో పాటు శ్రీలక్ష్మి, రాజగోపాల్ లు అరెస్టు అయ్యారు. ఆ తర్వాత చాలా కాలానికి వారు జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన శ్రీలక్ష్మి.. తనను తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్ కు బదిలీ చేయించాల్సిందిగా కోరారు. ఆ మేరకు జగన్ ఆమెకు సాయం చేయడంతో పాటుగా ఏపీ కేడర్ లో ఆమెకు కీలక పోస్టింగులు ఇచ్చారు.

రెండేళ్ల క్రితం ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే శ్రీలక్ష్మి వెయిటింగ్ లోకి వెళ్లిపోయారు. నాడు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమెను ఆ పోస్టు నుంచి తప్పించిన కూటమి సర్కారు… ఎలాంటి పోస్టు ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టారు. అయితే పదవీ విరమణకు శ్రీలక్ష్మి దగ్గరవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ సర్కారు ఆమెకు తాజాగా పోస్టింగ్ ఇచ్చింది. ఈ పోస్టింగ్ లోనూ శ్రీలక్ష్మికి కీలకమైన సాదారణ పరిపాలన శాఖలో పోస్టింగ్ దక్కడం గమనార్హం.