ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము ముగ్గురం కలిస్తే కొత్త చరిత్రేనని కూడా ఆ సీఎంలలో ఓ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సన్నివేశం కర్ణాకట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న తుంగభద్ర డ్యాం వద్ద కనిపించింది. ఈ అరుదైన సన్నివేశంలో ఈ మూడు రాష్టాల ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, ఎనుముల రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడులు ఒకే వేదికపై కనిపించారు. అది కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది.

ముగ్గురు సీఎంలలో డీకే, రేవంత్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కాగా… చంద్రబాబు టీడీపీ అధినేతగా ఉన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఈ సమావేశానికి వచ్చిన సీఆర్ పాటిల్ బీజేపీకి చెందిన కీలక నేత అన్న విషయం తెలిసిందే. మొత్తంగా రెండు ప్రధాన జాతీయ పార్టీలు, ఓ బలమైన ప్రాంతీయ పార్టీకి చెందిన నలుగురు నేతలు ఒకే వేదికపై కలిసి మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే దిశగా అడుగులు వేయడం గమనార్హం. తుంగభద్ర ద్యాంలో మొత్తం 33 గేట్లను కొత్తగా ఏర్పాటు చేసిన సందర్బంగా వాటిని ఈ నలుగురు నేతలు ప్రారంభించారు.

ముందుగా కేంద్ర మంత్రి హోదాలో పాటిల్ 17వ గేటును ప్రారంభించారు. ఆ తర్వాత డీకే 18వ గేటును ప్రారంభించారు. ఆపై 19వ గేటును చంద్రబాబు, 20వ గేటును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భందా చంద్రబాబు ప్రారంభించిన 19వ గేటు వద్ద ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. తుంగభద్ర డ్యాం నిర్మాణమై ఇప్పటికే 70 ఏళ్లు పూర్తి కాగా…గేట్లలో కొన్ని పాడైపోయాయి. దీంతో పాడైపోయిన గేట్లతో పాటు మొత్తం 33 గేట్లను కొత్త వాటితో మార్చేశారు. ఈ కొత్త గేట్లను ప్రారంభించేందుకే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. ప్రాజెక్టు కర్ణాటక పరిధిలో ఉండగా.. ఈ ప్రాజెక్టు నుంచే అటు తెలంగాణలోకి, ఇటు ఏపీలోకి తుంగభద్ర జలాలు ప్రవహిస్తున్నాయి.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కర్ణాకట సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులం పాలుపంచుకున్నామన్న ఆయన.. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల పేర్లను ప్రస్తావించారు. తాము ముగ్గురం కలిసి చరిత్రను చదవడమో, దానిని రిపీట్ చేయడం లేదని చెప్పారు. తాము ముగ్గురం కలిసి కొత్త చరిత్రను లిఖించామని ఆయన పేర్కొన్నారు. తాము ముగ్గురం కలిసి మూడు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్దికి పాటు పడతామని, ముగ్గురం కలిసి సాగుతామని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే… తుంగభద్ర, కృష్ణా జలాల పంపిణీలో ఎగువన ఉన్న కర్ణాటకతో దిగువన ఉన్న తెలంగాణ, ఏపీల మధ్య నిత్యం వివాదాలు తలెత్తుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమైందంటే చాలు తుంగభద్ర డ్యాం కింద ఉన్న రాజోలిబండ డైవర్షన్ స్కీం వద్ద తెలంగాణలోని పాలమూరు, ఏపీలోని కర్నూలు జిల్లాల రైతుల మధ్య నిత్యం యుద్ధ వాతావరణం నెలకొంటోంది.

ఈ తరహా పరిస్థితులు ఇప్పుడు లేకున్నా… తరచూ జరుగుతూనే ఉన్నాయి. డీకే చెప్పినట్లుగా ఈ ముగ్గురు సీఎంలు కలిస్తే.. భవిష్యత్తులో మూడు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తవని చెప్పాలి. అదే సమయంలో నదుల అనుసంధానం దిశగా పనిచేస్తున్న చంద్రబాబు కల సాకారం దిశగా ఈ ముగ్గురు కీలక భూమిక పోషించే అవకాశాలూ లేకపోలేదు. వెరసి ఈ ముగ్గురూ కలిసి సాగితే మాత్రం నిజంగానే… కొత్త చరిత్ర లిఖితమైనట్టేనని చెప్పాలి.