సుప్రీం చెప్పింది… మోడీ క‌దిలారు: దేశ‌వ్యాప్తంగా దాడులు!

సుప్రీంకోర్టు హెచ్చ‌రిక‌లు, దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం క‌దిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో జ‌రుగుతున్న సైబ‌ర్ మోసాల‌పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధ‌మైంది. తాజాగా గురువారం ఏక‌ కాలంలో 16 రాష్ట్రాల్లోని 82 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు నిర్వ‌హించారు. వీటిలో ఏపీ, తెలంగాణ‌, ఈశాన్య రాష్ట్రాలు స‌హా అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దులు పంచుకునే రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

మ‌రోవైపు.. ప్ర‌ధాని మోడీ.. సీబీఐని ఉద్దేశించి కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని, వాటి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై అందే ఫిర్యా దులపై సత్వర కేసుల నమోదుకు వీలుగా ఈఎస్ఐఆర్, జీరో ఎఫ్ఎస్ఐఆర్ వంటి వాటిని బలోపేతం చేయాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆయ‌న సూచ‌న‌లు చేశారు.

గురువారం ఉద‌యాన్నే దేశ‌వ్యాప్తంగా సీబీఐ దాడులు ప్రారంభ‌మ‌య్యాయి. ముఖ్యంగా సైబ‌ర్ మోసాల‌తో పాటు డిజిట‌ల్ అరెస్టులు, న‌కిలీ ఖాతాలు, మ‌నీ లాండ‌రింగ్‌, మ్యూల్ అకౌంట్ల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు. ఆప‌రేష‌న్ చ‌క్ర‌-6 పేరుతో చేప‌ట్టిన ఈ దాడులు.. మొత్తం 16 రాష్ట్రాల్లో 82 ప్రాంతాల్లో సాగుతున్నాయి. ఇప్ప‌టికే న‌మోదైన కేసులు.. విచార‌ణ చేస్తున్న తీరు, ఫోన్ల నంబ‌ర్లు, లొకేష‌న్లు, ఐడీ కార్డులు ఇలా.. అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తును ముమ్మ‌రంచేయ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఇద్ద‌రిని అరెస్టు చేసినట్టు అధికారు లు తెలిపారు.

సుప్రీం కొర‌డా!

సైబ‌ర్ నేరాల నియంత్ర‌ణ‌పై సుప్రీంకోర్టు ఇటీవ‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. బాధితుల విష‌యంలో ఎవ‌రు బాద్య‌త తీసుకుంటార‌ని ప్ర‌శ్నించింది. కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని గాలికి వ‌దిలేసిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని.. కేవ‌లం తూతూ మంత్రంగానే చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని.. ఇలా అయితే.. దేశంలో సైబ‌ర్ నేర‌స్తుల‌కు అడ్డు అదుపు ఉండ‌ద‌ని వ్యాఖ్యానించింది. త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో స్పందించిన మోడీ.. నేరుగా ఈ విష‌యంపై దృష్టి పెట్ట‌డం గ‌మ‌నార్హం.