కేంద్ర మంత్రివ‌ర్గంలో ఏపీ నుంచి మ‌రో ఇద్ద‌రు?

కేంద్ర మంత్రివ‌ర్గం ప్ర‌క్షాళ‌న దాదాపు ఖ‌రారైన నేప‌థ్యంలో ఏపీ నుంచి మ‌రో ఇద్ద‌రు ఎంపీల‌కు మంత్రి యోగం ప‌ట్ట‌నుంద‌ని టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. గుంటూరు ఎంపీ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడులు మంత్రి ప‌ద‌వులు పొందారు. అయితే.. ఇప్పుడు జ‌ర‌గ‌నున్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా ద‌క్షిణాదికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా 2029 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీకి, జ‌న‌సేన‌కు కూడా ప్రాధాన్యం క‌ల్పించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. గ‌త ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ త‌గ్గిన నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన బ‌ల‌మైన మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి.. కేంద్రంలో అధికారం ద‌క్కించుకునేందుకు బీజేపీకి స‌హ‌క‌రించాయి. ప్ర‌స్తుతం ఉత్త‌రాదిలో బీజేపీ హ‌వా త‌గ్గుతూ వ‌స్తోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ద‌క్షిణాదిపైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొనే అవ‌కాశం ఉంది.

దీనిని ముందుగానే ప‌సిగ‌డుతున్న బీజేపీ పెద్ద‌లు.. ద‌క్షిణాదిలో విస్త‌రించేందుకు త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌ను ప్ర‌ధానంగా భావించారు. కానీ, ఫ‌లితం ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో తమ మిత్ర‌ప‌క్షాల‌ను మ‌రింత ద‌గ్గ‌ర చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఏపీకి మరో రెండు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌నున్నట్టు తెలుస్తోంది. వీటిలో స‌హాయ మంత్రులు లేదా.. ఇండిపెండెంట్ మంత్రిత్వ శాఖ‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ఈ రెండు కూడా.. టీడీపీకి ఒక‌టి జ‌న‌సేన‌కు ఒక‌టి కేటాయించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం టీడీపీ మంత్రులుగా ఉన్న‌వారిలో ఒక‌రు ఇండిపెండెంట్ చార్జిలో ఉండ‌గా.. మ‌రొక‌రు సహాయ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాబ‌ట్టి.. ఈ ద‌ఫా రెండు ప‌ద‌వులు కూడా స‌హాయ మంత్రులుగా ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా కేంద్రంలో మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం ద్వారా కూట‌మి ఐక్య‌త‌ను మ‌రింత పెంచ‌డంతోపాటు ద‌క్షిణాది మిత్రుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్న సంకేతాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.