మోదీకి అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు

రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. ప్రముఖ నటుడు, సైంటిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ రస్తోగి స్టేజ్ పైకి వెళ్తున్నప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ కరచాలనం కోసం చెయ్యి చాపారు. కానీ రస్తోగి మాత్రం అటు చూడకుండా నమస్కారం చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ కావడంతో, తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే ఇది మోదీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఫెయిల్యూర్ అంటూ విమర్శించడంతో ఈ టాపిక్ కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది.

ఈ వివాదంపై స్పందించిన అనిల్ కుమార్ రస్తోగి ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తన వయసు 80 ఏళ్లు దాటిపోయిందని, ఆ వయసులో ఉండే కంగారు వల్ల ప్రధాని చేయి చాపిన విషయాన్ని తాను అస్సలు గమనించలేకపోయానని ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతే తప్ప కావాలని అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. దేశ ప్రధాని అంటే తనకు చాలా గౌరవం ఉందని, మన దేశాన్ని నడిపించడానికి మోదీనే బెస్ట్ లీడర్ అని ఆయన చెప్పుకొచ్చారు.

గమనించక జరిగిన ఒక చిన్న పొరపాటును పట్టుకుని ఇలా రాజకీయం చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ఇక డాక్టర్ రస్తోగి నటుడే కాదు, దేశానికి గొప్ప సేవలు అందించిన సైంటిస్ట్ కూడా. ఇప్పటివరకు 75కి పైగా సినిమాలు, 500 టీవీ షోలు, వెయ్యికి పైగా నాటకాల్లో నటించి మెప్పించారు. మరోవైపు సైంటిస్ట్ గా 78 పరిశోధనా పత్రాలను కూడా ప్రచురించారు. వీటికి తోడు పేద రోగులకు తనవంతు సాయం అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. మంగళవారం జరిగిన రెండో విడత కార్యక్రమంలో రస్తోగితో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వీరిలో టెన్నిస్ స్టార్ విజయ్ అమృత్‌రాజ్, సినిమా హీరో మమ్ముట్టి, సతీష్ షా, సింగర్ అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ లాంటి వాళ్లు ఉన్నారు.