సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించగా… తాజాగా ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అరెస్టయ్యారు. ఈ కేసుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్న నాగరాజును విచారించిన తర్వాత ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణపై 20కి పైగా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుల విచారణ పేరిట అతడిని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు పిలిపించిన సీఐ నాగరాజు… ఆ తర్వాత అతడిపై థర్గ్ డిగ్రీ ప్రయోగించారని, ఆ క్రమంలోనే అతడు మరణించాడని, అటుపై సాయి మృతదేహాన్ని పోలీసులే కాల్చి వేశారన్న ఆరోపణలు రావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. రాజకీయంగానే వేడి రాజుకోవడంతో ఈ వ్యవహారంలో వాస్తవాలేమిటన్న విషయాన్ని తేల్చేందుకు కూటమి సర్కారు సిట్ ను ఏర్పాటు చేసింది.

అంతేకాకుండా సిట్ ఏర్పాటు కాకముందే.. కృఫ్ణలంక పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్న నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయనపై కేసు కూడా నమోదు చేసింది. గడచిన నాలుగైదు రోజులుగా విజయవాడ కేంద్రంగానే కీలక ఆధారాలను సేకరిస్తూ సాగిన సిట్.. కృష్ణలంక పీఎస్ లో సీసీటీవీ ఫుటేజీ కూడా మాయం అయ్యిందన్న విషయాన్ని గ్రహించింది. ఈ సీసీటీవీ ఫుటేజీని ఎవరు మాయం చేశారన్న దిశగా దర్యాప్తు సాగించిన సిట్..మంగళవారం నేరుగా నాగరాజు ఇంటికి చేరుకుని ఆయనను అరెస్టు చేసింది.

ఇదిలా ఉంటే… నిజాయతీగా పనిచేస్తున్న నాగరాజుపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోరాదని పెద్ద సంఖ్యలో మహిళలు సోమవారం నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగరాజును మంగళవారం సిట్ అధికారులు అరెస్టు చేస్తున్న సమయంలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగరాజు అరెస్టును ఖండిస్తూ కొందరు నినాదాలు చేశారు. అయినా వారిని పక్కకు తప్పించి నాగరాజును తమ అదుపులోకి తీసుకున్న సిట్.. ఆయనను అక్కడి నుంచి తరలించింది.