ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాన్ని ఓ దరిద్రంతో పోల్చిన పవన్… కుల భావన అనేది ఓ దరిద్రమని, దానిని వీడితే తప్పించి రాష్ట్రం అభివృద్ది బాటలో నడవదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను పకడ్బందీగా అమలు చేయాలని తాను భావిస్తానని, అదికార యంత్రాంగానికీ తాను అదే చెబుతానని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని, అప్పుడు శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నేను హోమ్ మినిస్టర్ కాదని, అదే క్రిమినల్స్ అందరికీ అదృష్టం అని సంచలన వ్యాఖ్య చేశారు.
ఈ మేరకు శనివారం కాకినాడలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో శనివారం రాత్రి మన ఊరు..మాటా మంతి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పవన్ పాలుపంచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులకు తాను ఇచ్చిన హామీల మేరకు పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అంతేకాకుండా ఆయా పథకాల కింద పలువురు మత్స్యకారులు, మత్స్యకారుల సంఘాలకు ఆయన నిధులను అందజేశారు. అనంతరం ప్రసంగించిన పవన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ప్రస్తుతం విజయవాడకు చెందిన యువకుడు సాయికృష్ణ అదృశ్యంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన పవన్… చిన్న వయసులోనే 23 నేరాలకు పాల్పడ్డ యువకుడిని తాను అయితే వెనకేసుకుని రాబోనని అన్నారు. పసివాడు ఏదో తెలియక నేరాలు చేశాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారన్న పవన్… అలాంటి వ్యాఖ్యలు, అనవసరమైన సానుభూతి తన నుంచి రాబోదని ఆయన తెలిపారు. పసివాడైతే నేరాలు ఎలా చేశాడని కూడా ఆయన ప్రశ్నించారు. అయినా తప్పు చేసిన వాడిని వెనకేసుకుని వస్తున్న తీరు సమాజానికి తీవ్ర ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ తరహా భావనలు ఏ ఒక్కరి నుంచి కూడా వినరాని పరిస్థితి రావాలంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. నేరం చేసిన వాడు తన పార్టీవాడైనా అతడిని విడిచిపెట్టమని తాను అడగబోనని కూడా ఆయన పేర్కొన్నారు. పాలకులు శాంతి భద్రతల పరిరక్షణకు కీలక చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. తాను తన నియోజకవర్గంలో గానీ, జిల్లాలో గానీ తాను ఫలానా అదికారికి పోస్టింగ్ ఇవ్వండని ఏ ఒక్కరినీ తాను అడగబోనన్నారు. అంతేకాకుండా ఆయా అధికారులకు వారి విధి నిర్వహణలో చట్టానికి లోబడి పనిచేసే వాతావరణం కల్పించాలని కూడా పవన్ అభిప్రాయపడ్డారు. అప్పుడే శాంతి భఃద్రతలు పటిష్టంగా మారతాయని ఆయన అన్నారు.
ఇక కులం కార్డుపై పవన్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. కులాన్ని ఓ దరిద్రంతో ఆయన పోల్చారు. కుల దరిద్రం పోతేనే రాష్ట్రం అభివృద్ది బాటన పయనిస్తుందన్నారు. కుల భావన పనిచేసేనంతకాలం అభివృద్ధిని ఆశించడం దుర్లభమేనని పవన్ చెప్పారు. ప్రతి విషయంలోకి కులాన్ని లాగడం సరికాదన్నారు. నేరాలు చేసిన వారికి కులాలు ఆపాదించి వారి పట్ల సానుభూతి వ్యక్తమయ్యేలా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరం చేసిన వాడు ఏ కులం వాడైనా కూడా శిక్ష పడి తీరాల్సిందేనన్నారు. పసిపిల్లాడు తెలియక ఓ వ్యక్తం మెడను కత్తితో కోస్తే కూడా ఆ వ్యవహారానికి కులాన్ని ఆపాదించడం చూస్తే మనం ఎక్కడికి పోతున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates