ఏపీకి ఉజ్వల భవిష్యత్తును అందించే దిశగా రూపుదిద్దుకున్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భోగాపురంలో ఏర్పాటు చేసిన షభలో కూటమి పార్టీలకు చెందిన కీలక నేతలంతా పాలుపంచుకున్నారు. సభలో మోదీతో పాటు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు కీలక ప్రసంగాలు చేయగా… టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు దిశగా కూటమి సర్కారు సాగుతూ ఉంటే… అదంతా తమ ఘనతేనని చెప్పుకుంటున్న విపక్ష వైసీపీ తీరు అందరిని విస్మయానికి గురి చేస్తోందని చెప్పక తప్పదు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం నేపథ్యంలో గడచిన మూడు, నాలుగు రోజులుగా ఈ ఎయిర్ పోర్టు ఘతన ఎవరిదన్న విషయంపై లెక్కలేనంత భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. అందులో భాగంగా భోగాపురం ఎయిర్ పోర్టుపై విపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పలువురు గుర్తు చేస్తున్నారు. ఎర్ర బస్సులకే దిక్కులేని బోగాపురంలో ఎయిర్ పోర్టు కట్టి ఏం చేస్తారంటూ జగన్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంబోత్సవం సందర్భంగా భలే వైరల్ అవుతున్నాయి.
ఇక భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభంలోనూ జగన్ వ్యాఖ్యలను పరోక్షంగా గుర్తు చేసిన టీడీపీ యువ నేతలు… జగన్ పై అదిరిపోయే పవర్ పంచ్ లు సంధించారు. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంలో పాలుపంచుకున్న సందర్భంగా మాట్లాడిన లోకేశ్… గతంలో జగన్ అన్న మాటలను పరోక్షంగా గుర్తు చేశారు. గతంలో భోగాపురానికి ఎర్ర బస్సులే రావని కొందరు అన్నారని వ్యాఖ్యానించిన లోకేశ్… ఎర్ర బస్సులే రాని భోగాపురానికి ఎయిర్ బస్సులను తీసుకువచ్చామని, అది కూటమి సర్కారు ఘనత, విజన్ అని ఆయన అన్నారు. ఎర్ర బస్సులూ రావని మీరన్న చోటికి ఎయిర్ బస్సులను తీసుకువచ్చామని, ఇప్పటికైనా అర్థమైందా రాజా? అంటూ లోకేశ్ తనదైన శైలి పవర్ పంచ్ ను సందించారు.
ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హోదాలో ప్రసంగించిన టీడీపీ యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఇదే మాటను ప్రస్తావించారు. కొందరు నేతలు ఉత్తరాంధ్రను తక్కువ చేసి మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భోగాపురానికి ఎర్ర బస్సులకే దిక్కు లేదని, ఎయిర్ పోర్టులను తీసుకుని వచ్చి ఏం చేస్తారని కొందరు అన్నారని ఆయన వ్యంగ్యోక్తులు విసిరారు. ఉత్తరాంధ్రపై ఏధో ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు కొందరు నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రపై ఎవరికి ఎంత ప్రేమ ఉందన్న విషయం భోగాపురం ఎయిర్ పోర్టుతోనే తేలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

