ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం.. వ్యవస్థలను నాశనం చేయడం తప్ప.. ఇంకేం చేసిందని ఆయన నిలదీశారు. రైతులను కూడా వదిలి పెట్టుకుండా వేధించారని విమర్శించారు. రైతుల భూములు కొట్టేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చారని తెలిపారు. దీనివల్ల రైతులు ఎంత క్షోభను అనుభవించారో ..తనకు అనేక మంది చెప్పారని అన్నారు. అందుకే ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని.. అధికారంలోకి రాగానే అమలు చేశామని తెలిపారు.
రైతులకు ఆది నుంచి టీడీపీ ప్రభుత్వం మేలు చేసిందని చంద్రబాబు తెలిపారు. పల్నాడులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రైతులకు నిధులు విడుదల చేసిన అనంతరం.. చంద్రబాబు మాట్లాడారు. రైతులు లేనిదే రాష్ట్రాలు లేవని.. ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతును కూడా గత పాలకులు వేధించారని.. విమర్శించారు. రైతులు తమ సమస్యలు చెప్పుకొనేం దుకు వస్తే.. ఓ ఎమ్మెల్యే(వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు) చెప్పుతో కొట్టి తీవ్రంగా అవమానించాడని తెలిపారు. ఇలాంటి వారి వల్ల.. రాష్ట్రానికి మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? అనేది ఆలోచన చేయాలన్నారు.
వైకుంఠ పాళీ వద్దు..
ధ్వంసమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా గాడిలో పెడుతున్నామన్న సీఎం చంద్రబాబు.. ఈ రాష్ట్రం మరింత అభివృద్ది చెందేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఒక ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలం కొనసాగించిన గుజరాత్ వంటి రాష్ట్రాలు నేడు అభివృద్దిలో ముందుకు సాగుతున్నాయన్నారు. పల్నాడు ప్రాంతంలోనే రాజధానిని నిర్మిస్తున్నామని.. హైదరాబాద్+గా రాజధాని ఉంటుందని పేర్కొన్నారు. రాజధాని రావడంతో పల్నాడులోనూ భూముల ధరలు పెరిగాయని, ఇక్కడి కుటుంబాలకు ఆదాయం కూడా పెరిగిందని వివరించారు. వైకుంఠపాళీ ఆలోచనలను పక్కన పెట్టి సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించాలని సూచించారు.
తేడా గమనించండి!
గత పాలకుల అకృత్యాలకు.. ప్రస్తుత సుపరిపాలనకు, ప్రజాపాలనకు తేడా గమనించాలని చంద్రబాబు సూచించారు. గతంలో ఏ విషయం అయినా… నాకేంటి? అనే వారే ఉన్నారని.. కానీ.. ఇప్పుడు వ్యవస్థలను పారదర్శకంగా తీర్చిదిద్దామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా.. 200లకు పైగా సేవలను ప్రజలకు చేరువ చేసినట్టు వివరించారు. తద్వారా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఇంటి నుంచి పనులు చేయించుకునే వెసులు బాటు కలిగిందన్నారు. పేదలకు రూ.5కే అన్నం పెడుతున్న ప్రభుత్వం దేశంలో తమదేనని చెప్పారు. కనీసం పేదలను కూడా గత గొడ్డలి ప్రభుత్వం పట్టించుకోలేదని.. కక్షతో 5 రూపాయల అన్నాన్ని కూడా తీసేసిందని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates