విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్ధం దేవాలయం దగ్గరకు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ధర్మయాత్ర జరగబోతోంది. ఈనెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు ఛలో రామతీర్ధం దర్మయాత్ర పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు జనసేన ప్రెస్ నోట్ విడుదల చేసింది. మామూలుగా అయితే ఈ కార్యక్రమాన్ని జనసేన ఒకటే నిర్వహించాలని అనుకున్నది. కానీ ఏమైందో ఏమో చివరి నిముషంలో బీజేపీని కూడా కలుపుకుంది.
రెండుపార్టీలు మిత్రపక్షాలై సుమారుగా పదిమాసాలైంది. ఇంతవరకు ఏ ఒక్క కార్యక్రమం కూడా కలిసి చేసింది లేదు. పొత్తు పెట్టుకునే సమయంలో మాత్రం ఏ కార్యక్రమం జరిగినా సంయుక్తంగానే చేపడతామని గంభీరంగా ప్రకటిచారు నేతలు. చివరకు సంయుక్త కార్యక్రమాలన్నవి కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తున్నా ఎక్కడా జనసేన నేతలు కనబడలేదు.
అలాగే జనసేన గానీ లేకపోతే పవన్ కల్యాణ్ కార్యక్రమాల్లో కూడా ఎందులోను బీజేపీ పాల్గొనలేదు. జనసేనంటు చేసిన ప్రోగ్రాములు పెద్దగా లేవనే చెప్పాలి. మొన్నటి నివర్ తుపాను నేపధ్యంలో పవన్ చేసిన పర్యటనలు, మొన్నటి కృష్ణాజిల్లా గుడివాడ, ఉయ్యూరుల్లో చేసిన రోడ్డుఫోల్లో కూడా బీజేపీ నేతలు కనబడలేదు. అంటే పేరుకు మాత్రమే మిత్రపక్షాలు కానీ క్షేత్రస్ధాయిలో మిత్రత్వం ఎక్కడా కనబడలేదు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల నేపధ్యం రెండు పార్టీల మధ్య గ్యాప్ బాగా పెంచేసినట్లే కనిపిస్తోంది.
తాజాగా రేగుతున్న రామతీర్ధం దేవాలయం వివాదంలో కూడా రెండుపార్టీలు వేటికవే ప్రకటనలు ఇచ్చేస్తున్నాయి. దేవాలయం దగ్గర బీజేపీ నేతలు గోల చేస్తున్నారే కానీ జనసేన నేతలు కనబడలేదు. ఢిల్లీలో ఉన్న సోమువీర్రాజు హైదరాబాద్ లో ఉన్న పవన్ కూడా మీడియా రిలీజులిచ్చి చేతులు దులిపేసుకున్నారు. అలాంటిది హఠాత్తుగా రామతీర్ధంకు ప్రోగ్రామ్ పెట్టేసుకున్నారు పవన్. తర్వాత ఏమైందో ఏమో వెంటనే బీజేపీని కూడా కలిపేసుకున్నారు. మొత్తానికి ఇంతకాలానికి రామతీర్ధమే మిత్రపక్షాలను కలిపినట్లయ్యింది.