ఈ ఏడాది ఫిబ్రవరి 28. ప్రపంచం కళ్లు తెరుస్తున్న సమయం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయని, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. ఆయన కుటుంబం లక్ష్యంగా కీలక ప్రాంతాల్లో యుద్ధం చేశారని.. వారు మృతి చెందారని బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయి. ఇలా.. ప్రారంభమైన.. అమెరికా-ఇరాన్ యుద్ధం.. దాదాపు 42 రోజుల పాటు నిరాటంకంగా కొనసాగింది.
ఎలా మొదలై.. ఎక్కడికి?
వాస్తవానికి ఈ యుద్ధం ఎవరి కోసం మొదలైంది? ఎలా మొదలైంది? అనేది ఆసక్తికరం. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వివాదాలు ఉన్నాయి. ఇరాన్ మిత్రపక్షంగా ఉన్న హైతీలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా హైతీలతో కలిసి.. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై దాడులకు సన్నాహాలు చేసింది. దీంతో ఇజ్రాయెల్ కు ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా ఇరాన్.. అణు పరీక్షలు చేసేందుకురెడీ అయిందంటూ.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహూ.. గత ఏడాది చివరిలో కీలక ప్రకటన చేశారు.
అంతేకాదు.. ఈ క్రమంలో అమెరికా సాయాన్ని కూడా ఇజ్రాయెల్ అర్ధించింది. ఎక్కడ అణు ప్రయోగాలు జరిగినా.. ఖస్సుమని లేచే అమెరికా.. ఇరాన్ విషయంలోనూ అలానే స్పందించింది. వాస్తవానికి ఉత్తర కొరియా కూడా అణు పరీక్షలు చేస్తోంది. అయితే.. ఆదేశం జోలికి పోని.. అమెరికా.. ఇరాన్‌పై కత్తి దూసింది. ఈ క్రమంలోనే ముందుగా చర్చల పేరుతో ప్రారంభమైన వ్యవహారం.. అనూహ్యంగా చెప్పాపెట్టకుండా.. ఇరాన్‌పై దాడులు చేసి.. సుప్రీంలీడర్ కుటుంబాన్ని అంతం చేసే వరకు వచ్చింది.
నిజానికి ఇరాన్ చిన్న దేశమని.. తమ ముందు చివురుటాకులా వణుకుతుందని అమెరికా అంచనా వేసింది. నిజమే. కానీ.. ఇక్కడే ఇరాన్ తన బుద్ధి కుశలతకు.. మెరుగు పెట్టి.. అమెరికాను ఎదుర్కొనేందుకు ప్రపంచాన్ని తనకు పావుగామార్చుకుంది. కీలకమైన హోర్ముజ్ జలసంధిని నిలువరించింది. అంతేకాదు.. అమెరికా సైన్యాన్ని కూడా సవాల్ చేసింది. ఇలా.. యుద్ధం ఇరు పక్షాల భీకరంగా మారింది. చిత్రం ఏంటంటే.. ఈ మొత్తం యుద్దానికి కారణమైన ఇజ్రాయెల్ తప్పుకోగా.. అమెరికా-ఇరాన్‌ల మధ్యే ప్రత్యక్ష యుద్ధం కొనసాగింది.
అమెరికా ఉక్కిరి బిక్కిరి
ఇరాన్ చర్యలతో ప్రపంచ చమురు రవాణా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో అమెరికాపై సహజంగా నే ఒత్తిడి పెరిగింది. కీలకమైన నాటో దేశాలు.. అమెరికాకు సహాయ నిరాకరణ ప్రకటించాయి. ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. మరోవైపు.. అమెరికాలోనే ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. దీనికి తోడు ఇరాన్‌లో కూడా.. అమెరికా వ్యతిరేకత పెద్దగా కనిపించింది. ఫలితంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకటి కాదు.. నాలుగు మెట్లు దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే శాంతి ఒప్పందం జరిగింది. అయితే.. ఇది కూడా 60 రోజుల ముచ్చటే. ఆ తర్వాత.. ఏం జరుగుతుందనేది ఈ 60 రోజుల్లో ఇరు దేశాలు వ్యవహరించే తీరును బట్టి ఆధారపడి ఉంటుంది.
ఏం మిగిలింది?
వాస్తవానికి ఈ యుద్ధం ఎక్కడ ఎందుకు మొదలైంది.. అంటే, కేవలం ఇరాన్ చేస్తున్న అణు ప్రయోగాలు, అణు ధార్మిక పదార్థాల నిల్వల కోసమే ప్రారంభమైంది. కానీ, చివరకు.. శాంతి ఒప్పందంలో ఈ ఊసు లేకుండా పోవడం గమనార్హం. ఇరాన్.. అణు పదార్థాలను శుద్ధి చేసుకోవచ్చు… కానీ.. ఇతర దేశాలకు విక్రయించరాదన్నదే శాంతి ఒప్పందంలోని చిట్టచివరి అంశం. సో.. వాస్తవానికి యుద్ధం ఏ విషయంపై అయితే మొదలైందే.. ఆ విషయం పక్కకు తప్పుకోగా.. అమెరికా ఆత్మ రక్షణ ఒక్కటే ఇప్పుడు చర్చకు వచ్చింది. దీనికి కారణం.. ట్రంప్ వాల్యూ తగ్గుతుండడం.. వచ్చే రెండు మాసాల్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉండడమే. ఫలితంగా ఏం మిగిలింది? అంటే.. ఇరాన్ ప్రజలతో పాటు.. ప్రపంచ దేశాల ప్రజలకు కన్నీళ్లు.. ధరాభారం.. చమురుకు రేషన్.. లేఆఫ్‌లు!!.
Gulte Telugu Telugu Political and Movie News Updates