వైసీపీ చేస్తున్న రాజకీయాలకు చెక్ పెడుతూ.. విజయవాడ కృష్ణలంకలోని సాయికృష్ణ కుటుంబం కీలక వ్యాఖ్యలు చేసింది. తమ కుమారుడు ఎక్కడున్నా తీసుకురావాలని.. లేదా.. మృతదేహాన్నయినా.. అప్ప గించాలని కోరుకుంటున్నట్టు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామలు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు సంపూర్ణ సహకారం ఉందన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తమకు నమ్మకం ఉందన్నారు.
తమకు జరిగిన అన్యాయం వేరే ఏ కుటుంబానికీ జరగకూడదని కోరుకుంటున్నామన్నారు. సీఎం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారని.. అలానే తమకు న్యాయం చేస్తారని నమ్ముతున్నామని విజయలక్ష్మి చెప్పారు. కేసునిష్పాక్షికంగా జరుగుతుందన్న నమ్మకం కూడా వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలపై మాకు నమ్మకం ఉంది. వారు మాకు న్యాయం చేస్తారు. ఈ నెల 29లోగా మా కుమారుడిని మాకు అప్పగిస్తే చాలు అని విజయలక్ష్మి అన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, మాకు అండగా నిలిచిన రాజకీయ పార్టీలకు ధన్య వాదాలు. సాయికృష్ణ అదృశ్యం అంశంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపారు. వెంటనే విచారణకు ఆదేశించారు. మా ఇంటికి ఎమ్మెల్యే కూడా వచ్చారు. ప్రభుత్వం మాకు తప్పకుండా న్యాయం చేస్తుందని పూర్తి నమ్మకం ఉంది. అని సాయికృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిని ఎవరూ రాజకీయ, కుల కోణంలో చూడవద్దని.. వారు విజ్ఞప్తి చేశారు.
రంగంలోకి బృందం..
సాయికృష్ణ అదృశ్యం కేసుపై విచారణ చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ బృందంలో సభ్యుడిగా ఉన్న ఏసీపీ దైవ ప్రసాద్.. శుక్రవారం ఉదయం కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి వచ్చారు. ఆ సమయంలో విజయలక్ష్మి ఆసుపత్రికి వెళ్లారని తెలుసుకుని అక్కడే గంటసేపు చుట్టుపక్కల వారిని విచారించారు. అనంతరం.. తల్లి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దాదాపు గంటన్నరపాటు దైవప్రసాద్ విచారణ కొనసాగించారు. కాగా.. శనివారం నుంచి పూర్తిస్థాయి విచారణ ప్రారంభం కానుందని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates