దాదాపు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత.. అనేక రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి.. నిర్మించిన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో భారీ దోపిడీ జరిగిందని అధికారులు ప్రకటించారు. వాస్తవానికి ఈ చర్చ.. గత నెల రోజులుగా సాగుతోంది. ఇదేదో.. బయట నుంచి వచ్చిన వారి పనికాదని కూడా అంటున్నారు. బాల రామయ్యకు భక్తులు సమర్పించిన.. కోట్ల రూపాయల నగదుతోపాటు.. విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలు కూడా మాయమయ్యాయని అధికారులు గుర్తించారు.
తొలుత ఈ విషయాన్ని నెల రోజుల కిందట.. యూపీ ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ స్థానిక ఎంపీ బయటపెట్టారు. రామయ్య ఆలయంలో దోపిడీ జరుగుతోందని.. నిధులు దోచేస్తున్నారని.. పేర్కొంటూ.. ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అయితే.. ఇది రాజకీయంగా దుమారం రేపింది. యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఈ పోస్టు పై వివరణ ఇవ్వాలంటూ.. సదరు ఎంపీకి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే.. ఆతర్వాత.. ఈ వ్యవహారంపై రామజన్మభూమి ట్రస్టులోని కొందరు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
దీంతో ప్రభుత్వానికి సొంత నేతల నుంచే విమర్శలు వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాత స్థాయిలో నిర్మించిన ఆలయంలో దోపిడీ జరగడం.. అది కూడా ఇంటి మనుషులపైనే ఆరోపణలు రావడంతో వెనువెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు.. దోపిడీ నిజమేనని నిర్ధారించారు. ప్రాధమికంగా.. 11 కోట్ల రూపాయల నగదు లెక్కలు సరిపోలడం లేదని తెలిపారు. అదేవిధంగా నగలు, వజ్రాభరణాలు కూడా కనిపించడం లేదన్నారు.
200 మందిపై అనుమానం..
రంగంలోకి దిగిన అధికారులు 200 మందిని అనుమానితులుగా పేర్కొన్నారు. వీరిలో గత 48 గంటల్లో 120 మందిని విచారించారు. నగదు పోయిన మాట వాస్తవమేనని తేల్చారు. అయితే.. ఈ ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాలు.. లెక్కించే బాధ్యతను ఎస్‌బీఐకి అప్పగించారు. అంటే.. ఆలయం బాధ్యత తక్కువగా ఉంటుంది. ఈ కోణంలో కూడా.. విచారణ చేస్తున్నారు. మొత్తంగా ప్రతిపక్షాలు చెప్పినట్టు 200 కోట్ల రూపాయలు కాకపోయినా.. దీనిలో పదో వంతైనా దోపిడీ చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
బిగ్ ట్విస్ట్ ఇదీ..
ఇక, ఆలయంలో నగదు, ఆభరణాలు ఉంచే.. ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. దీనికి గాను ఆలయం 10 కోట్ల రూపాయలపైనే ఖర్చుచేసి .. హైసెక్యూర్డ్ సీసీ టీవీలను ఏర్పాటు చేసింది. కానీ, గత నెల రోజులుగా ఇవి పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. అంతేకాదు.. కెమెరాల ఏర్పాటును కూడా మార్చేశారని గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం పక్కాప్లాన్‌తోనే చేశారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రం మౌనంగా ఉండగా.. ఉత్తరప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం నిరసనలకు పిలుపునిచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates