తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ సమగ్రత.. సేనా దళం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పలు సందర్భాల్లో మాట్లాడారు. తెలంగాణపై స్పందిస్తూ.. తాను ఈనెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ పట్టాలని చూసినట్టు తెలిపారు.
దీనికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పారు. పోనీ.. తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించి..వెనుదిరుగుతానని పోలీసులకు విజ్ఞప్తి చేసినా.. దానిని కూడావారు తోసిపుచ్చారని.. నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించలేదని చెప్పారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన సైనికులకు స్మారకంగా నిర్మించిన ఇండియా గేట్ వద్ద నివాళులర్పించేందుకు కులం, ప్రాంతం వంటివి చూడరని.. అందరినీ అనుమతిస్తారని తెలిపారు. అలాకాదంటే.. ఇండియా గేట్ వద్ద నివాళులర్పించేందుకు పంజాబ్, కశ్మీర్, ఢిల్లీ, హరియాణాలలోనే జన్మించిన వారిని అనుమతించే పరిస్థితి ఉంటుందా? అని ప్రశ్నించారు.
తెలంగాణకు తాను వ్యతిరేకం కాదన్నారు. కేవలం విభజన చేసిన తీరును మాత్రమే తాను ప్రశ్నించినట్టు తెలిపారు. తనకు తెలంగాణ స్ఫూర్తినిచ్చిన నేలగా జీవితాంతం తన గుండెల్లో పదిలంగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని.. వారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఒక నేల కోసం.. ఇంత మంది.. అది కూడా స్వతంత్ర దేశంలో ఆత్మబలిదానాలు చేసుకుంటారా? అని తనకు అనిపించిందన్నారు.
వారి పట్ల తనకు ఎప్పుడూ… గౌరవం ఉంటుందన్నారు. అయితే.. యువత బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో నాయకులు గద్దెనెక్కారని.. వారి ఆకాంక్షలు మాత్రం అలానే ఉండిపోయాయని అన్నారు. అంతేకాదు.. బలిదానాలు చేసిన కుటుంబాలను గుర్తించేందుకు 12 సంవత్సరాల కాలం పట్టిందని.. ఇప్పటి వరకు ఏం చేశారని పవన్ నిలదీశారు.
తెలంగాణ ఆశయాల కోసం కూడా జనసేన నిలబడుతుందన్నారు. అక్కడి యువత ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తామని పవన్ చెప్పారు. తెలంగాణలోనూ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పిన ఆయన.. నాయకులు, యువత బలంగా పార్టీ కోసం పనిచేయాలన్నారు. తెలంగాణలో పార్టీని బలంగా విస్తరిస్తామని.. ఇది తన కోసం కాదని.. తెలంగాణ యువత కోసమేనని చెప్పారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates