రాజకీయాల్లో రిటైరయ్యే ప్లాన్ వేసే వేళలో..పొలిటికల్ ఎంట్రీ గురించి ఆలోచించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. వందలాది సినిమాల్లో నటించిన రజనీకాంత్ కు ఎందుకీ విషయం అర్థం కాలేదు. ఆధ్యాత్మిక చింతనతో పాటు సున్నిత మనస్కుడిగా ఉండే వెండితెర సూపర్ స్టార్ రీల్ లో బాక్సాఫీసు హిట్లను ఎన్నింటినో ఇచ్చారు. అలాంటి ఆయన పొలిటికల్ ఎంట్రీలోనే డిజాస్టర్ అయ్యేలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. డెబ్భై ఏళ్ల వయసు.. అంతకు ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు పొలిటికల్ ప్రెజర్ ఎంత ఎక్కువగా ఉంటుందో వివరించి చెప్పాల్సిన అవసరం ఉంటుందా? అన్ని ఆలోచించకుండానే రాజకీయాల్లోకి వస్తానన్న నిర్ణయం తీసుకుంటారా?
వెండితెర మీద పంచ్ డైలాగులు.. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నర్మగర్భ సందేశాలు ఇచ్చే రజనీకి రాజకీయ ఆలోచన మీద స్పష్టత ఉండకుండా ఉంటుందా? పాతికేళ్లుగా అదిగో వస్తున్నా.. ఇదిగో వస్తున్నానన్న ఊరింపులు.. తలైవా వస్తే..తమ బతుకుల్లో ఏదో మార్పు వస్తుందన్న ఆశతో ఉన్న అభిమానుల్ని అంతలా నిరాశకు గురి చేయాల్సిన అవసరం ఏముంది?
అయినా.. ఎవరు అడిగారని ఆయన రాజకీయాల్లో వస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు.
ఎన్నికల వేళలో నోరు విప్పటం.. తర్వాత కామ్ అయిపోవటం.. మావోడు అంతేలే అనుకున్నంతనే.. ఊరించటం.. తర్వాత చప్పబడిపోవటం అలవాటుగా మారిందన్న విమర్శ వేళ.. అన్ని ఆలోచించేసినట్లుగా బిల్డప్ ఇచ్చి.. బాస్ ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అన్నట్లుగా తేల్చేసిన సూపర్ స్టార్.. రాజకీయ ఎంట్రీ గురించి వివరాలే కాదు.. పార్టీ ప్రకటనకు డేట్ ఇచ్చేసిన తర్వాత హటాత్తుగా తన పొలిటికల్ ఎంట్రీని పక్కన పెట్టేస్తూ ప్రకటన జారీ చేయటం.. అందుకు అనారోగ్యాన్ని సాకుగా చూపించటం చూసినప్పుడు ఎన్నో సందేహాలు.. మరెన్నో ఆలోచనలు ముసురుకోవటం ఖాయం. ఇంతకీ.. బాస్ తనకు తానుగా ఆగారా? లేదంటే ఎవరైనా ఆపారా? అన్నది అసలు ప్రశ్న. ఎందుకీ అనుమానం అంటే.. అందుకు తగినన్ని కారణాలు లేకపోలేదు.
మనదేశంలోని రాజకీయ సిత్రాలు.. మరే దేశంలోనూ కనిపించవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాంటి రాజకీయం. ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిన అందునా తమిళ రాజకీయాలు కాస్త భిన్నం. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. తమిళ రాజకీయాల్ని.. ప్రజల్ని ఇరువురు అగ్రనేతలు శాసించిన తర్వాత.. ఇరువురు కాస్త తేడాతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. దీనికున్న ప్రాముఖ్యత.. ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయానికి భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటాయన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఇంతకాలం ఊరించిన రజనీ.. హటాత్తుగా తన రాజకీయ ప్రవేశం గురించి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. కరుణ.. జయ లాంటి ఉద్దంత నేతలు లేని లోటును తీర్చేవారెవరు? అన్న ప్రశ్నకు తాను ఒకడున్నాడన్నట్లుగా ఆయన ఆశలు రేకెత్తించారు. రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న మాటతో అప్పటివరకు అధికారం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న డీఎంకే స్టాలిన్ కు కావొచ్చు.. అన్నాడీఎంకే పళనిస్వామి.. పన్నీర్ సెల్వాలకు చెమటలు పట్టిన పరిస్థితి.
క్లీన్ ఇమేజ్.. అంతకు మించిన ప్రజాదరణ వెరసి.. ఆయన రాజకీయ ప్రయాణంలో ఆసక్తికర పరిణామాలకు అవకాశం ఉందన్న భావన అందరిలోనూ వ్యక్తమైంది. రాజకీయాల్లోకి వస్తానని రజనీ చెప్పినంతనే విపక్ష డీఎంకే మొదలుకొని.. చాలానే పార్టీలు నోటికి పని చెప్పటం మొదలు పెట్టాయి. రాజకీయాలకు దూరంగా.. సినీ సూపర్ స్టార్ గా ఉన్నప్పుడు పల్లెత్తు మాట అనని వారంతా ఇప్పుడు అనకూడని మాటలు అనటం రజనీ లాంటి వారికి ఇబ్బంది.
ఇలాంటివి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మామూలే. ఏపీలో చిరంజీవి పరిస్థితి ఏమైంది? సినిమాల్లో మెగాస్టార్ గా.. టాలీవుడ్ లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన ఆయన..రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతానని అంచనా వేసుకున్నారు. ఆయన చుట్టూ ఉన్న వారంతా ‘అవును బాస్.. మీరు ఎంట్రీ ఇవ్వటమే ఆలస్యం.. సీఎం కుర్చీ మీదే’ అన్న మాటలు చాలానే చెప్పారు. అయితే..పార్టీ పెట్టిన కొద్దిరోజులకే అసలు విషయం అర్థం కావటమే కాదు.. తన బలం.. బలహీనత ఆయనకు అర్థమయ్యాయి. దశాబ్దాల తరబడి ఇమేజ్ చట్రంలోనూ.. వ్యక్తిపూజలోనూ తడిచి ముద్దయిన పరిస్థితి.
రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఘనస్వాగతాలు.. సత్కారాలు ఉండవు. దారుణ విమర్శలు.. ఘాటు ఆరోపణలు.. వ్యక్తిత్వ హననాలే ఉంటాయి. ఎంత ప్రిపేర్ అయినట్లు చెప్పినా.. వాస్తవంలో వాటిని ఎదుర్కోవటం అంత ఈజీ కాదు. టాలీవుడ్ లో చిరుకు ఉన్న ఇమేజ్ తో పోల్చినప్పుడు.. కోలీవుడ్ లో రజనీకి అంతకంటే ఎక్కువే ఉందన్నది సత్యం. అదే సమయంలో ఏపీ రాజకీయాలతో పోలిస్తే.. తమిళ రాజకీయాలు మరింత నాటుగా ఉంటాయి. ఇలాంటివేమీ అంచనా వేసుకోకుండానే రజనీ రాజకీయ ప్రకటన చేశారా? అంటే.. ఆలోచించి ఉండొచ్చు.. రాజకీయ ప్రకటన చేసిన తర్వాత.. పార్టీ పేరు ప్రకటించటానికి ఇచ్చిన గ్యాప్ లో ఏమేం జరిగాయన్నది కూడా కీలకమే కదా?
షూటింగ్ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన రజనీ.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై.. హుటాహుటిన అపోలోకు షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితినే చూస్తే.. పలు సందేహాలు కలుగక మానదు. ఇక్కడ.. రజనీని తప్పు పట్టటం ఉద్దేశం కాదు. లోతుగా చూస్తే.. పార్టీ పెడతానని చెప్పిన తర్వాత మారే సమీకరణాలు ఆయనకు ఊహించని రీతిలో ఒత్తిళ్లు రాకూడదన్న రూలేం లేదు కదా? అక్కడెక్కడో బిహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు.. తెలంగాణ నుంచి నిధులు భారీగా తరలివెళ్లాయన్న విషయంపై వచ్చిన వార్తల్ని చూసినప్పుడు.. ఈ రోజున దేశంలో ఎక్కడ ఏ రాజకీయ పరిణామం చోటు చేసుకున్నా.. దాని మూలాలు మరెక్కడో ఉండే పరిస్థితి.
దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అదే పనిగా హైదరాబాద్ శివారుకు వచ్చి.. ఒక సాములోరిని తరచూ కలిసి వెళ్లటం వెనుక మర్మం ఏమిటి? ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.. దానికి కాస్త ముందుగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెర చాటున జరిగిన ఎన్నో విషయాల్ని చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే. అందరికి కనిపించే రాజకీయానికి మించిన మరేదో తెర వెనుక జరుగుతుందన్నది వాస్తవం.
అంతదాకా ఎందుకు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరుగుతున్న ఎన్నికల సమయంలో.. ఒక ప్రముఖ రాజకీయ పార్టీ తన సోషల్ మీడియా ప్రచారం కోసం అనుసరించిన వ్యూహం.. అందుకు పని చేసిన వారెవరు? లాంటి వివరాలు బయటకు రానే లేదు. ఒక కార్పొరేషన్ ఎన్నికల కోసం వారు పెట్టిన ఖర్చు.. దింపిన బలగాల సమాచారం తెలిసిన వారంతా విస్మయానికి గురి చేసే పరిస్థితి. ఇలాంటివన్నీ చెప్పటం వెనుక ఉద్దేశం ఒక్కటే.. రాజకీయం అంటే.. పార్టీ పెట్టటం.. ప్రచారం చేయటం.. ఎన్నికల బరిలో నిలవటం.. లాంటి రోటీన్ అంశాలు కానే కావు.. అంతకు మించిన లెక్కలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు దేశ రాజకీయమే అలా తయారైందని చెప్పక తప్పదు.