తాము ఏపీ కోసం.. ఏపీ ప్రజల కోసం త్యాగం చేశామని.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 21 సీట్లకే రాజీ పడడం వెనుక త్యాగం ఉందన్నారు. రాష్ట్రంలో జరిగిన 2024 ఎన్నికల్లో పార్టీలు గెలవలేదని.. ప్రజలు విజయం సాధించారని పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవచిస్తున్న సబ్ కా సాథ్-సబ్ కా వికాస్ లక్ష్యంతోనే తాము కూడా పనిచేస్తున్నామన్నారు.
రెండేళ్ల కిందట ప్రజలు తమకు ఇచ్చింది అధికారం కాదన్న పవన్ కల్యాణ్.. దీనిని తాము బాధ్యతగా నెరవేరుస్తున్నామన్నారు. గ్రామాలను సైతం భారత దేశానికి కేంద్ర బిందువుగా మార్చాలన్న ప్రధాన ఉద్దేశంతో అత్యంత నిబద్ధతతో పాలన సాగిస్తున్నామన్నారు. చారిత్రాత్మక విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నామని తెలిపారు. అహంకారం.. విధ్వంసంపై 2024లో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. 2024లో ప్రజలు తమ ఓటు ద్వారా చరిత్రనుసృష్టించారని తెలిపారు.
ఒక తరం భవిష్యత్తుకు 2024లో ప్రజలు తీర్పు ఇచ్చారని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం.. కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రిగా.. గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రబుత్వానికి పంచాయతీల పాలన అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలకు.. ప్రజలకు కూడా కీలకమని తెలిపారు. పంచాయతీ పాలనను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
జనసేనకు 100 శాతంస్ట్రయిక్ రేట్ ఇచ్చారన్న పవన్ కల్యాణ్.. వ్యవస్థల బలోపేతానికి తాము కృషి చేస్తున్నట్టు తెలిపారు. వ్యవస్థలు బలహీన పడితే.. కులం, ప్రాంతీయ వాదం పెరుగుతాయని ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వం నాయకత్వంలో పాలన ముందుకు సాగుతోందని.. ప్రజలకు సుపరిపాలన అందుతోందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా పంచాయతీలు, గ్రామాల నుంచే నాయకులు ఉద్భవించాలని.. సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
