బీజేపీ ఖాతాలోకి మీనాక్షి సీటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు కేటాయించిన సీటు కాస్తా బీజేపీ ఖాతాలోకి చేరిపోయింది. మీనాక్షి నామినేషన్ వేసిన స్థానం నుంచి పోటీకి దిగిన రజనీశ్ అగర్వాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది. వెరసి ఇక మీనాక్షి.. ఆమె తరఫున కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో పోరాటం చేసినా ఇక ఫలితం ఉండదని చెప్పాలి.

ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో మధ్య ప్రదేశ్ నుంచి మూడు సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా… అధికార బీజేపీకి రెండు సీట్లు, విపక్ష కాంగ్రెస్ కు ఓ సీటు దక్కే అవకాశం ఉండింది. ఈ క్రమంలో తనకు దక్కిన ఏకైక సీటును కాంగ్రెస్ పార్టీ మీనాక్షికి కేటాయించింది. పార్టీ అదేశాల మేరకు మీనాక్షి నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే నామినేషన్ లో మీనాక్షి తనపై నమోదు అయిన కేసుల వివరాలను వెల్లడించలేదన్న బీజేపీ ఫిర్యాదును రిటర్నింగ్ అదికారి పరిశీలించి… ఆ ఆరోపణ నిజమేనని తేల్చి ఆమె నామినేషన్ ను తిరస్కరించారు.

మీనాక్షి ఈజీగా గెలిచే సీటుకు బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపి పోటీని అనివార్యం చేసింది. తనకు ఈజీగా దక్కే రెండు సీట్లను మహేశ్, తరుణ్ చుగ్ లకు కేటాయించిన బీజేపీ… మూడో అభ్యర్థిగా రజనీశ్ అగర్వాల్ ను బరిలోకి దింపింది. చివరి నిమిషన్ రజనీశ్ నామినేషన్ వేయడంతో మీనాక్షి సహా కాంగ్రెస్ పార్టీ షాక్ తిన్నారు.

ఈ షాక్ నుంచి వారు తేరుకునేలోపే.. కేసుల వివరాలు లేవన్న కారణం చూపి మీనాక్షి నామినేషన్ ను రిటర్నింగ్ అదికారి తిరస్కరించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది. సుప్రీంకోర్టులో రిటర్నింగ్ అదికారి నిర్ణయాన్ని తప్పుబడుతూ ఏకంగా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

అయితే మధ్యప్రదేశ్ లో ఖాళీ కానున్న మూడు సీట్లకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నానిమేషన్లు వేసిన నేపథ్యంలో ఆ ముగ్గురూ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనల్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేసింది.

కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన తర్వాత మీనాక్షితో పాటు కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి శుక్రవారం నాటి సుప్రీం విచారణ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏ రీతిన వాదనలు వినిపించి… కోర్టు నుంచి తనకు అనుకూలంగా తీర్పు సాదిస్తుందన్న అంశంపై ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది.