ధరలు పెరుగుతుంటే ఇష్టమంటారా ట్రంప్

అమెరికాలో వస్తువుల ధరలు గత మూడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత వేగంగా పెరిగిపోతుండటంతో జనాల్లో విషయం చర్చనీయాంశంగా మారింది. గత నెల మే నెలకు సంబంధించిన అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) 4.2 శాతానికి చేరుకుంది. ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, తనకు ఇన్ఫ్లేషన్ అంటే చాలా ఇష్టమని వైట్ హౌస్ లో వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధరలు పెరుగుతుంటే దేశ అధినేత ఇలా మాట్లాడటంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అమెరికాలో ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ఇరాన్ తో జరుగుతున్న యుద్ధమే. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ తో జరుపుతున్న పోరాటం వల్ల ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇరాన్ వ్యూహాత్మకంగా హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తగ్గిపోయింది. ఫిబ్రవరి చివర్లో యుద్ధం మొదలైనప్పుడు గాలన్ పెట్రోల్ ధర 2.98 డాలర్లు ఉండగా, ఇప్పుడు అది 4.15 డాలర్లకు చేరి సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతోంది. గ్యాస్, కరెంట్ బిల్లులతో పాటు విమాన టికెట్లు, వైద్య ఖర్చులు కూడా భారీగా పెరిగాయి.

విమర్శలు ఎక్కువ అవ్వడంతో ట్రంప్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. యుద్ధ సమయంలో కూడా ఇన్ఫ్లేషన్ అనుకున్నదానికంటే తక్కువగా ఉండటాన్ని తానే మెచ్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ యుద్ధం ముగియగానే పెరిగిన ధరలన్నీ ఒక్కసారిగా కిందకు పడిపోతాయని జోస్యం చెప్పారు. గతంలో తానే స్వయంగా ఐఓవా వెళ్లినప్పుడు పెట్రోల్ ధర కేవలం 1.85 డాలర్లు ఉందని, త్వరలోనే మళ్లీ ఆ రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు.

ధరల పెరుగుదల ట్రంప్ కు రాజకీయంగా పెద్ద సమస్యగా మారేలా ఉంది. ఎందుకంటే నవంబర్ లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు ఆర్థిక పరిస్థితినే ప్రధానాంశంగా చూస్తున్నారు. జో బైడెన్ కాలంలో ఉన్న 9.1 శాతం కంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తక్కువగానే ఉన్నా, సామాన్య కుటుంబాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ట్రంప్ వ్యాఖ్యలపై డెమొక్రాట్ నేత చక్ షూమర్ సోషల్ మీడియాలో మండిపడుతూ, ప్రజలపై అధ్యక్షుడికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని విమర్శించారు. మరోవైపు ఆర్థిక నిపుణులు మాత్రం భిన్నమైన హెచ్చరికలు చేస్తున్నారు. ఇరాన్ తో యుద్ధం ఇప్పుడే ముగిసినా, హార్ముజ్ జలసంధి ద్వారా వస్తువుల సరఫరా మళ్లీ సాధారణ స్థితికి రావడానికి 2027 వరకు సమయం పట్టవచ్చని చెబుతున్నారు.