పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన నేతల్లో స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది. ఏదో ప్రధాని చెప్పిన పని కూడా చేయాలి కదా… అలా ఫొటోలకు ఫోజులిస్తే సరిపోతుంది కదా అన్న చులకన భావనను ఇప్పటి నేతలు ఆశ్రయించడం లేదు.
ప్రధానే కాకుండా ఇతరులు ఎవరైనా మంచి మాటలు చెబితే…వాటిని పాటించడంలో అమితాసక్తి చూపుతున్నారు మన నేతలు. అందుకు నిదర్శనంగా ఇప్పుడు కేంద్ర మంత్రులు కార్ పూలింగ్ బాటను పట్టేశారు. ఆ దృశ్యం సుదీర్ఘ కాలం ప్రధానిగా కొనసాగి మోదీ రికార్డు నమోదు చేసిన ప్రత్యేకమైన రోజునే ఆయన కేబినెట్ లోని మంత్రులు కార్ పూలింగ్ ను మొదలెట్టేశారు.
అరుదైన రికార్డును అభినందించేందుకు,… భారత తొలి ప్రధాని నెహ్రూ రికార్డును అదిగమించినందుకు ప్రధాని మోదీని అభినందించేందుకు, సన్మానించేందుకు బుధవారం కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ భేటీకి కేంద్ర మంత్రులందరూ హాజరయ్యారు. వారిలో ఏపీకి చెందిన టీడీపీ యువనేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా కొనసాగుతున్న జ్యోతిరాధిత్య సింథియాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తూ కార్ పూలింగ్ బాట పట్టారు.
కేంద్ర కేబినెట్ మంత్రుల హోదాలో ఉన్న నాయుడు, సింథియాలు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్లలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీ ఇచ్చిన ఇందన పొదుపు చర్యల్లో భాగంగా కార్ పూలింగ్ కు సంబంధించి వీరిద్దరూ ఇదివరకే చర్చించుకున్నట్లు సమాచారం.
అందులో భాగంగా బుధవారం సింథియా ఇంటికి వచ్చిన నాయుడు… సింథియా కారులోకి ఎక్కేశారు. ఆ కారులో ఇద్దరు మంత్రులు నేరుగా కేబినెట్ సమావేశానికి వెళ్లారు. ఈ సన్నివేశానికి సంబందించి వీడియోను జాతీయ మీడియా ప్రతినిధులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ…ఈ ఇద్దరు యువ మంత్రులు కార్ పూలింగ్ ను ఆశ్రయించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్న ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
