మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీనాక్షితో పాటు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో ఇక మీనాక్షి రాజ్యసభకు వెళ్లడం దుస్సాధ్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్ కోటాలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనుండగా… అధికార బీజేపీ తొలుత రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగిలిన ఒక రాజ్యసభ సీటును దక్కించుకునే సంఖ్యలో ఎమ్మెల్యేలను కలిగిన కాంగ్రెస్… ఆ సీటును మీనాక్షికి ఇచ్చింది. అయితే చివరాఖరులో రెండు సీట్లను దక్కించుకున్న తర్వాత కూడా తమ వద్ద మరింత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న వాదనతో బీజేపీ మూడో సీటుకూ అభ్యర్థిని ఖరారు చేయగా… మొత్తంగా మూడు సీట్లకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.

ఈ క్రమంలో మీనాక్షి ఎన్నికకు పోలింగ్ తప్పనిసరి అన్న వాదనలు వినిపించగా… మంగళవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఆమె నామినేషన్ పై బీజేపీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. మీనాక్షి తన కేసుల వివరాలను అఫిడవిట్ లో పొందుపరచలేదన్న బీజేపీ ఫిర్యాదును పరిశీలించిన రిటర్నింగ్ అధికారి… మీనాక్షి నామినేషన్ లో కేసుల వివరాలు లేవని తేల్చారు. దీంతో ఆమె నామినేషన్ ను చెల్లనిదిగా ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామంతో మీనాక్షితో పాటు కాంగ్రెస్ పార్టీ షాక్ తిన్నది.

అయితే ఇతరత్రా వివరాలను పక్కనపెట్టేసిన కాంగ్రెస్ నేతలు… బీజేపీ ఫిర్యాదు చేస్తే తమ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరిస్తారా? అంటూ రిటర్నింగ్ అదికారి తీరుపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు పార్టీ సీనియర్లు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ తదితరులు ఢిల్లీలోని ఈసీ కార్యాలయానికి వెళ్లారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు… వారిని ఈసీ కార్యాలయం గేటు వద్దే అడ్డుకుని వారిని కార్యాలయం లోపలికి అనుమతించలేదు. తన నామినేషన్ తిరస్కరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మీనాక్షి.. ఈ తరహా చర్యలతో బీజేపీ వైఖరి ఏమిటన్నది తేలిపోయిందని, ఏకపార్టీ పాలనను ఆ పార్టీ బలవంతంగా రుద్దుతోందని మండిపడ్డారు.