స‌త్య‌నారాయ‌ణ సంత‌సం.. మాట నెర‌వేర్చిన చంద్ర‌బాబు!

స‌త్య‌నారాయ‌ణ గారూ.. రేపు సిద్ధాంతం వ‌స్తున్నా.. అక్క‌డ క‌లుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు స‌త్య‌నారాయ‌ణ‌కు ఆదివారం సీఎం చంద్ర‌బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇచ్చిన హామీని నెర‌వేర్చారు. సోమ‌వారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని సిద్ధాంతంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు సుదీర్ఘ స‌మ‌యం ఇక్క‌డే గ‌డిపారు. రైతులతో ముఖాముఖి నిర్వ‌హించారు. అనంత‌రం.. పొలాల‌ను ప‌రిశీలించారు. అలానే వారికి ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాల‌ను కూడా అందించారు. ఈ కార్య‌క్ర‌మాల‌తోను సుమారు స‌మ‌యం సాయంత్రం 5గంట‌లు దాటిపోయింది.

దీంతో షెడ్యూల్ ప్ర‌కారం వెనుదిర‌గాల్సిన ముఖ్య‌మంత్రికి స‌త్య‌నారాయ‌ణ‌కు ఇచ్చిన హామీ స్ఫుర‌ణ‌కు వ‌చ్చింది. ఆ వెంట‌నే ఆయ‌న‌ను త‌న కాన్వాయ్‌లోకి పిలిపించుకున్నారు. స‌త్య‌నారాయ‌ణ వెంట ఆయ‌న మ‌నువ‌డు కూడా వ‌చ్చారు. ఎప్పటి నుంచో తనను చూడాలనుకుంటున్న స‌త్య‌నారాయ‌ణ‌ కోరికను ముఖ్యమంత్రి తీర్చారు. స‌త్య‌నారాయ‌ణ‌ను కుశ‌ల ప్ర‌శ్న‌లు అడిగారు. ఆరోగ్యం గురించి. ఆదాయం గురించి వాక‌బు చేశారు. ఈ సంద‌ర్భంగా స‌త్యానాయ‌ణ త‌న మ‌న‌సులో మాట‌ను చంద్ర‌బాబుకు విన్న‌వించారు.

తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్యసాయం అందించాలని సత్యనారాయణ ముఖ్యమంత్రిని కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం లేద‌ని.. దానిని కూడా ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఈ రెండు అంశాల‌కు అప్ప‌టిక‌ప్పుడే చంద్ర‌బాబు స్పందించారు. స‌త్య‌నారాయ‌ణ‌ కుమారుడికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. అలానే.. గ్రామంలో డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌ర‌చాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అంతేకాదు.. సత్యనారాయణ కోర‌క‌పోయినా.. ఆయ‌న ఇల్లు లేద‌ని తెలుసుకున్న చంద్ర‌బాబు.. స‌త్య‌నారాయ‌ణ‌కు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

ఎవ‌రీ స‌త్య‌నారాయ‌ణ‌..

చంద్ర‌బాబు.. దేవుడు.. మ‌హారాజు.. ఆయ‌న గంగ‌తో స‌మానం అంటూ వ్యాఖ్యానించి హ‌ఠాత్తుగా వార్త‌ల్లోకి ఎక్కిన స‌త్య‌నారాయ‌ణ‌.. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందినవారు. ఈయ‌న సీఎం చంద్రబాబుకు వీరాభిమానిగా పేరొందారు.

తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని తెలిసిన ఆయ‌న‌.. చంద్ర‌బాబును గంగ‌తో పోల్చారు. గంగ కోసం.. మ‌నం వెళ్లాలి. ఇప్పుడు గంగే మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తోంది అని వ్యాఖ్యానించి చంద్ర‌బాబు మ‌న‌సు దోచారు. దూరం నుంచైనా ఆయన్ను చూడాలని భావించ‌డంతో స‌త్య‌నారాయ‌ణ కోరిక‌ను చంద్ర‌బాబు ఈడేర్చారు.