‘హిట్లర్’ రచ్చకు ఫుల్ స్టాప్ ఎప్పుడో…?

తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య హిట్లర్ పేరు ఆధారంగా సాగుతున్న వాదోపవాదాలు రచ్చను తలపిస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు కీలక నేతలు ఈ వ్యవహారంపై తమదైన శైలిలో వ్యాఖ్యలు చేయగా… ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. అసలు ఈ హిట్లర్ రచ్చకు ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడు అంటూ పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

తెలంగాణలో ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటుగా ప్రకృతి విపత్తుల్లో సహాయక చర్యల కోసం రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం నాటి ఉప్పల్ బహిరంగ సభలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి హైడ్రా పేరు ఆవిర్భావాన్ని ప్రస్తావిస్తూ హిట్లర్ పేరును పలికారు. ప్రభుత్వ నియమ నిబంధనలను పక్కాగా అమలు చేయడంతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సంస్థకు హిట్లర్ హయాంలోని హైడ్రా పేరును తీసుకున్నామని చెప్పారు.

రేవంత్ నుంచి ఈ మాట వినిపించినంతనే… బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అందుకున్నారు. రేవంత్ నిజంగానే హిట్లర్ లాంటి మనస్తత్వం కలిగిన వారేనని, తెలంగాణలో రేవంత్ రెడ్డి… హిట్లర్ తరహా నిరంకుశ పాలనను అవలంబిస్తున్నారని ఆరోపించారు. నిరంకుశుడిగా మారిన రేవంత్ తనను తాను హిట్లర్ గా అభివర్ణించుకుంటున్నారని కూడా హరీశ్ రావు ఒకింత ఘాటు వ్యాఖ్యలనే చేశారు.

హరీశ్ రావు వ్యాఖ్యలను కాంగ్రెస్ సర్కారు తీవ్రంగా పరిగణించినట్టుంది. హరీశ్ రావు చేసిన హిట్లర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేరుగానే రంగంలోకి దిగారు. అందులో భాగంగా సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబు… హిట్లర్ నిరంకుశ పాలన వేరు, ప్రస్తుత సమాజంలో హిట్లర్ పేరును ప్రస్తావించడం వేరు అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్ ను మాజీ సీఎం కేసీఆర్.. నాజీల బంకర్ గా వాడారని ఆయన ఆరోపించారు.

రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడిగా నిలిచిన హిట్లర్ నిరంకుశుడిగానే తనకు తాను ముద్ర వేసుకున్నారని శ్రీధర్ బాబు చెప్పారు. అయితే ప్రస్తుత సమాజంలో హిట్లర్ పేరును ప్రస్తావిస్తే… సదరు వ్యక్తి నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించే వారని, ఏదైనా పనిని ప్రారంభిస్తే.. దానిని అకుంఠిత దీక్షతో, పట్టు వదలని శ్రద్ధతో పూర్తి చేసే వ్యక్తులను హిట్లర్ గా పిలుస్తారని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ కూడా అదే పట్టుదలతో శ్రమిస్తున్నారని చెప్పిన శ్రీధర్ బాబు… హిట్లర్ అనగానే నిరంకుశుడనే మాటను పక్కనపెట్టాలని సూచించారు.