ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే ఈ ప్రమాదంపై అందరికంటే ముందుగా స్పందించిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే జరిగిందన్న అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన కొద్దిసేపట్లోనే విశాఖ కేంద్రంగానే అమర్నాథ్ మీడియా ముందుకు వచ్చారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేశ్ తో కలిసి మీడియా ముందుకు వచ్చిన అమర్నాథ్… ఈ ప్రమాదంపై తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై తనదైన శైలి అనుమానాలను వ్యక్తం చేసిన ఆయన… విశాఖ స్టిల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. గతంలో ఈ తరహా ప్రమాదాలు విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరగనే లేదని చెప్పిన అమర్నాధ్.. ఇప్పుడే ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఉక్కు ద్రవాన్ని పైకి ఎత్తుతున్న సమయంలో భారీ బకెట్ నుంచి ఉక్కు ద్రవం లీకైన కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నది ప్రాథమిక సమాచారం. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన అమర్నాథ్… కూటమి ప్రభుత్వం అదికారం చేపట్టాక…కంపెనీలో భద్రతా చర్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు.
సరైన మెయింటెనెన్స్ లేని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలతో పాటుగా వేలాది మంది విశాఖ ఉక్కు కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో అమర్నాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates