కడప రెడ్లు ఆవేదనకు గురయ్యారు సర్! అంటూ టీడీపీ సీనియర్ నాయకుడు, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి భర్త.. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును ఉద్దేశించి సుదీర్ఘ లేఖ రాశారు. దీనిలో కొంత భాగాన్ని ఆయన సోషల్ మీడియాలోనూ పెట్టారు. కడపలో ఇప్పుడిప్పుడే.. రెడ్డి సామాజిక వర్గం టీడీపీ వైపు మళ్లిందని.. అందుకే.. గత ఎన్నికల్లో కడపలో చాలా సీట్లు టీడీపీకి అనుకూలంగా మారాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో కడపలో పట్టు సాధించేదిశగా అడుగులు వేస్తున్నట్టు పేర్కొన్నారు.
కానీ, తాజాగా జరిగిన రాజ్యసభ సీట్ల పంపిణీ వ్యవహారంతో కడపలోని రెడ్డి సామాజిక వర్గం, ముఖ్యంగా టీడీపీని అభిమానిస్తున్న రెడ్లు కూడా.. తీవ్ర ఆవేదనలో ఉన్నారని తెలిపారు. తనకు వ్యక్తిగతంగా మరింత ఇబ్బందిగా మారిందన్నారు. గత ఏడాది కడపలో నిర్వహించిన మహానాడు సమయంలోనే రాజ్యసభకు పంపిస్తానని.. కష్టాన్ని గుర్తిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజ్యసభ సీటుపై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా తాను రాజ్యసభలో అడుగు పెట్టాలని కడపలోని చాలా మంది రెడ్డి నాయకులు కూడా ఎదురు చూశారని పేర్కొన్నారు.
ఆ తర్వాత కూడా తనకు పలు సందర్భాల్లో రాజ్యసభ సీటు నీకు రిజర్వ్ చేశాను.. అని చెప్పినట్టు చంద్రబాబుకు శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. కానీ, తాజాగా తనకు రాజ్యసభ సీటును ఇవ్వలేదని.. తాను ఎంతో ఆశ పెట్టుకున్నానని తెలిపారు. పార్టీ కోసం అనేక కేసులు కూడా పెట్టినా.. వైసీపీ హయాంలో పనిచేశామని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచానని తెలిపారు. రాజకీయ, ఆర్థిక, మానసిక ఒత్తిళ్లను కూడా ఎదుర్కొని పార్టీ కోసం కష్టించి పనిచేశాను అని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తనకు రాజ్యసభసీటు ఇవ్వనందుకు అత్యంత ఆవేదన చెందుతున్నానన్నారు.
కడపలో ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకునే దశలో ఉందన్న శ్రీనివాసరెడ్డి.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని ఇక్కడి నాయకులు భావించారని తెలిపారు. అనేక సార్లు రాజ్యసభ సీటుపై ఆశలు పెంచి.. ఇస్తానని హామీ ఇచ్చి కూడా ఇవ్వనందుకు తీవ్ర ఆవేదనకు గురవుతున్నామన్నారు. పార్టీని ముందుకు నడిపించడంలో పదవులు కీలక పాత్ర పోషిస్తాయన్న మీకు తెలియంది కాదు.. అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. పార్టీ కోసం.. ప్రజల కోసం కార్యకర్తల కోసం.. మరింత గట్టిగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates